మార్కెట్లోకి కొత్త పాలసీలను విడుదల చేసేందుకు జీవిత, సాధారణ బీమా సంస్థలు పోటీ పడుతుంటాయి. పాలసీలను తీసుకొచ్చేందుకు వాటికవే అవకాశాలను సృష్టించుకుంటాయి. దేశంలో కరోనా మహమ్మారి ఇంకా తన విశ్వరూపం చూపించని రోజుల్లోనే.. తక్కువ ప్రీమియానికే కరోనా పాలసీలు.. అంటూ వరసకట్టాయి. బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏ) 'శాండ్‌బాక్స్'ను ఉపయోగించుకుని, వినూత్న పాలసీలు తీసుకొచ్చామని చెప్పుకున్నాయి. చాలా సాధారణ బీమా సంస్థలు బ్యాంకులు, వ్యాలెట్లు, మొబైల్ నెట్‌వర్క్‌లతో కలిసి ఆన్‌లైన్‌లో పాలసీలను అందించాయి. అయితే, ఇవన్నీ రూ.25వేలు-రూ.లక్ష మధ్యలోనే ఉండేవి. కొవిడ్-19 పాజిటివ్ వస్తే.. ఈ పరిహారాన్ని అందిస్తామని చెప్పాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పటికే తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీల్లో కరోనా చికిత్సకు పరిహారం ఇవ్వాల్సిందేనని ఐఆర్‌డీఏ చెప్పడంతో బీమా సంస్థలు ఈ ప్రత్యేక పాలసీల జోరును తగ్గించాయి. కొన్ని బీమా సంస్థలు వాటిని ఇవ్వడం మానేశాయి కూడా. ఇక 'డిసీజ్ స్పెసిఫిక్'గా కరోనా కోసం ప్రత్యేకంగా రెండు రకాల పాలసీలను తీసుకురావాలని గతనెల ప్రారంభంలో నియంత్రణ సంస్థ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. అన్ని బీమా సంస్థలూ ఒకే ప్రామాణిక నిబంధనలతో ఈ పాలసీలను తీసుకురావాలని తెలిపింది. ముందు జూన్ 15 వరకూ పాలసీలను అందుబాటులోకి తేవాలని చెప్పింది. తర్వాత జూన్ 30కి గడువు పెంచింది. బీమా సంస్థలు మరింత సమయం కావాలని అడగటంతో జులై 10 లోగా కొత్త పాలసీలను తేవాలని మరోసారి మార్గదర్శకాలు, పాలసీల పేర్లనూ (కరోనా కవచ్, కరోనా రక్షక్) విడుదల చేసింది. అయితే.. ఈసారికైనా ఈ కొత్త పాలసీలు వస్తాయా? అనేది ఇప్పుడు అందరిలోనూ నెలకొన్న సందేహం..
- కరోనా వైరస్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మహమ్మారి..
- చికిత్స కోసం రూ.లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి..
- ఆరోగ్యం కుదుటపడ్డా.. ఇది మిగిల్చే ఆర్థిక భారం మాత్రం కోలుకోలేని దెబ్బే..
- మీకు అనారోగ్యం వస్తే మేమున్నాం... అంటూ ప్రకటనలు చేసే బీమా సంస్థలు..
- కరోనా పాలసీల విషయంలో మాత్రం ఇదుగో వస్తున్నాం.. అదుగో తెస్తున్నాం...అంటున్నాయి కానీ, ఇప్పటికీ ముందుకు రావట్లేదు..
- ఐఆర్‌డీఏ మార్గదర్శకాలనూ.. చూసీచూడనట్లు వదిలేస్తున్నాయి...
ప్రీమియం ఎంతో..
సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీలను రూపొందించి, వాటికి ప్రీమియం నిర్ణయించేముందు.. ఆయా వ్యాధుల చికిత్సకు ఎంత ఖర్చవుతుంది? అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఆ జబ్బు ఎంతమందిపై ప్రభావం చూపిస్తోంది.. ప్రాంతాల వారీగా ప్రీమియం ఎలా ఉండాలి.. ఇలాంటివన్నీ బీమా సంస్థ లెక్కలు వేస్తుంది. ఐఆర్‌డీఏ కరోనా కోసం తెచ్చే పాలసీలకు మార్గదర్శకాలను రూపొందించింది. ప్రీమియం నిర్ణయాధికారం బీమా సంస్థకే ఉన్నా.. దేశం మొత్తం అదే ప్రీమియం ఉండాలని నిబంధన విధించింది. ప్రస్తుత కష్టకాలంలో బీమా సంస్థలు ఇష్టానుసారం పాలసీలు తీసుకురాకుండా ఇది కట్టడి చేసేదే. కానీ, దీన్ని సాకుగా చూపిస్తూ.. ప్రీమియం నిర్ణయించడానికి కాస్త సమయం పడుతుందని చెబుతూ.. బీమా సంస్థలు పాలసీల విడుదలను జాప్యం చేస్తున్నాయి. ‘ఐఆర్‌డీఏ చెప్పింది కాబట్టి, కచ్చితంగా పాలసీలు తీసుకురావాల్సిందే. కానీ వీటికి ఆదరణ లభించకుండా చేసేందుకు అధిక ప్రీమియాన్ని నిర్ణయించే ఆస్కారం లేకపోలేదని’ బీమా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పూర్తిస్థాయి బీమా తీసుకోరని..
కొవిడ్-19తో వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికీ శ్రద్ధ పెరిగింది. అన్ని రంగాల్లోనూ ఇబ్బందులు ఎదురై.. వ్యక్తుల ఆదాయం తగ్గింది. ఈ సమయంలో అనారోగ్యం బారిన పడితే.. ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని అందరికీ అవగాహనా పెరిగింది. దీంతో ఆరోగ్య బీమా పాలసీలపై చాలామంది దృష్టి పెట్టారు. ఇప్పటికీ ఈ పాలసీలు లేనివారు.. వీలైనంత తొందరగా పాలసీలను తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ గిరాకీని బీమా సంస్థలు సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న పాలసీలను విక్రయించేందుకు కొన్ని నిబంధనలూ సడలించేందుకు సిద్ధం అయ్యాయి. కొన్ని బీమా సంస్థలైతే.. పాలసీదారు చెప్పిన ఆరోగ్య వివరాలనే తీసుకొని, పాలసీలు అందించాయి.
పాలసీదారుల సంఖ్య పెంచుకోవడమే లక్ష్యంగా ఇవి పనిచేశాయి. ఇప్పుడు కొత్తగా కరోనా ప్రత్యేక పాలసీలను తీసుకొస్తే.. ఇక పూర్తిస్థాయి బీమా పాలసీలను తీసుకునేందుకు ఎవరూ ముందుకురారని బీమా సంస్థలు సందేహిస్తున్నట్లు కనిపిస్తోంది. తక్కువ ప్రీమియంతో ఉండే ఈ పాలసీలతోపాటు, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాకు మించిందేమీ లేదనే అభిప్రాయంతో ఉన్న పాలసీదారులు ఈ ప్రత్యేక పాలసీలు తీసుకుంటే.. తమ వ్యాపారం తగ్గుతుందని ఇవి భావిస్తున్నాయి.