కోడి మాంసం, గుడ్లు తింటే కరోనా వైరస్ వ్యాధి సోకుతుందనే వదంతులు కోళ్ల పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టివేశాయి. ప్రజలు కోడి మాంసం, గుడ్లు ముట్టుకోవటానికి వెనకాడటం వల్ల అమ్మకాలు అధఃపాతాళానికి పడిపోయి, పౌల్ట్రీ రైతులు కనీవినీ ఎరుగని నష్టాల పాలవుతున్నారు. కోళ్లను, గుడ్లను అమ్ముకోలేక ఉచితంగా పంపిణీ చేస్తున్న వైనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తోంది. కొన్ని ప్రదేశాల్లో అయితే గోతులు తీసి పాతిపెడుతున్న ఉదంతాలు కూడా ఉంటున్నాయి. ఓ పక్క చైనాతో పాటు, యూఎస్, ఐరోపా దేశాల్లో కోడి మాంసం, గుడ్డు వినియోగం పెరుగుతుండగా, మనదేశంలో మాత్రం దీనికి భిన్నంగా వీటిని తినటానికి ప్రజలు వెనుకంజ వేస్తున్నారని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి. 'కరోనా వైరస్ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది, అంతేగానీ కోడి మాంసం- గుడ్డు తింటే రాదు, కానీ ఈ విషయంలో జరిగిన అసత్య ప్రచారం ప్రజలపై ప్రభావం చూపుతోంది' అని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. వదంతులను ప్రజలు నమ్మవద్దని, కోడిమాంసం, గుడ్డు తినటం ద్వారా సమృద్ధిగా ‘ప్రొటీన్లు’ ఉన్న పోషకాహారాన్ని తీసుకున్నట్లు అవుతుందని గుర్తించాలని సూచిస్తున్నాయి.
రికార్డు స్థాయిలో తగ్గిన ధరలు..
రెండు నెలల క్రితం వరకూ కిలో కోడి మాంసం (స్కిన్‌లెస్) రిటైల్ ధర రూ.180 వరకూ ఉండగా, ఇప్పుడు అది రూ.80- 90కి పడిపోయింది. అదేవిధంగా గుడ్డు ధర రూ.4.25 నుంచి రూ.2 కు పడిపోయింది. కిలో కోడి ఫారం గేట్ ధర రూ.85 నుంచి రూ.33కు తగ్గిపోయింది. కిలో కోడి పెంపకం ఖర్చే రూ.80 వరకూ ఉంటుంది. గుడ్డు ఉత్పత్తికి రూ.3.50 ఖర్చవుతుంది. దీనికి తోడు వినియోగం మూడొంతులు క్షీణించింది. తత్ఫలితంగా పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు భారీగా నష్టాలు కూడబెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు రెండు నెలల నుంచి ఈ పరిస్థితి ఉంది. రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతోంది. ఉన్న కోళ్లు అమ్ముడు కాని పరిస్థితుల్లో పౌల్ట్రీ రైతులు కొత్తగా కోడి పిల్లలు తెచ్చి పెంచటం కూడా నిలిచిపోతోంది. పౌల్ట్రీ పరిశ్రమ నుంచి డిమాండ్ క్షీణించటం కారణంగా కోళ్ల దాణాలో వినియోగించే మొక్కజొన్న, సోయా ధరలు కూడా పతనం అవుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ మొక్కజొన్న ఒక టన్నుకు రూ.20,000 ధర పలకగా ఇప్పుడు అది రూ.12,000 కు పడిపోయింది. అదేవిధంగా సోయా ధర రూ.45,000 నుంచి రూ.32,000 కు క్షీణించింది. దీనివల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. వీరందరి ఉపాధికి ముప్పు కనిపిస్తోంది.
అక్కడ అలా.. ఇక్కడ ఇలా..
పరిశ్రమ వర్గాల కథనం ప్రకారం చైనా, అమెరికా, ఐరోపా దేశాల్లో గత కొద్ది రోజులుగా కోడి మాంసం, గుడ్డు వినియోగం భారీగా పెరిగాయి. అదే క్రమంలో ధరలు కూడా పెరుగుతున్నాయి. చైనాలో కోడి మాంసం ధర రెట్టింపు అయినట్లు, బ్రెజిల్, సింగపూర్ దేశాల్లోనూ ధరలు పెరుగుతున్నట్లు స్థానిక పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కానీ మనదేశంలో దీనికి భిన్నంగా వినియోగం, ధరలు పతనం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు వచ్చి పరిశ్రమను ఆదుకోవాలని సంబంధిత వర్గాలు కోరుతున్నాయి. అదే సమయంలో ప్రజలు కూడా భయం వీడి కోడి మాంసం, గుడ్డు తినటానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
ప్రజలు భయపడాల్సిన పనిలేదు