తెలంగాణ

telangana

ETV Bharat / business

ముడి ఔషధాలకు కరోనా సెగ - ముడి ఔషధాలపై కరోనా ప్రభావం,.

కరోనా ధాటికి చైనా విలవిలలాడుతోంది. ఇప్పుడు వైరస్​ ప్రభావం భారత్​మీద కూడా చూపుతోంది. దేశంలో కరోనా కేసులు లేనప్పటికి దీని ప్రభావం మాత్రం ఔషధ తయారీ మీద పడుతోంది. మందుల తయారీలో వినియోగించే ప్రాథమిక రసాయనాలు చైనా నుంచి దిగుమతి కాకపోవటం వల్ల దేశీయంగా వీటి ధరలు వేగంగా పెరిగిపోతున్నాయి.

ముడి ఔషధాలకు కరోనా సెగ
ముడి ఔషధాలకు కరోనా సెగ

By

Published : Feb 25, 2020, 6:10 AM IST

Updated : Mar 2, 2020, 11:55 AM IST

కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) సమస్య దీర్ఘకాలం కొనసాగితేనే ఇబ్బందులు ఎదురవుతాయని దేశీయ ఔషధ పరిశ్రమ భావించింది. అయితే ఇప్పటికే ఈ ప్రభావం మొదలైంది. మందుల తయారీలో వినియోగించే ప్రాథమిక రసాయనాలు, ఇంటర్మీడియేట్స్‌ కోసం మనం చైనా మీద అధికంగా ఆధారపడుతున్నాం. అక్కడ నుంచి తగినంతగా ముడి ఔషధాలు సరఫరా కాకపోవచ్చనే అనుమానాలతోనే, దేశీయంగా వీటి ధరలు వేగంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉన్న నిల్వలనూ కొందరు దాస్తున్నందునే, ఈ పరిస్థితి వస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య చైనాలో పెరగడమే కాక నెమ్మదిగా పొరుగు దేశాలకు విస్తరిస్తోంది. దక్షిణ కొరియాలో కూడా ‘వైద్య అత్యవసర పరిస్థితి’ ఏర్పడటంతో, అక్కడి ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు చేపట్టడంలో తలమునకలైంది. ఇటలీలో కూడా ‘కరోనా వైరస్‌’ మరణాలు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాల వ్యాపార, పారిశ్రామిక వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే పరిస్థితి మనదేశంలోనూ కనిపిస్తోంది.

ప్రధానంగా విటమిన్లు, యాంటీ-వైరల్‌ విభాగానికి చెందిన ముడి ఔషధాల ధరలు పెరుగుతున్నట్లు ఫార్మా కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. చైనాలో ఏటా ఫిబ్రవరి మొదటివారం వరకు నూతన సంవత్సర సెలవులుంటాయి. ఆ సమయంలో అక్కడి నుంచి తగినంతగా

దిగుమతులు ఉండవు కాబట్టి దేశీయ కంపెనీలు తమకు అవసరమైన ముడిపదార్ధాలను చైనా నుంచి అక్టోబరు- డిసెంబరు మధ్యలోనే అధికంగా దిగుమతి చేసుకుని నిల్వ చేస్తాయి. ఈసారి చైనాలో సెలవులు పొడిగించి, ఈనెల 20 వరకు కంపెనీలు, కార్యాలయాలు మూసివేశారు. ఫలితంగా సరకు ఆర్డర్లు కూడా తీసుకోలేదు. దేశీయంగా చూస్తే, ప్రధానంగా ముంబయిలోని భివండీ ప్రాంతంలో ఔషధ గోదాముల్లో ముడిఔషధ నిల్వలుంటాయి. వీటిని ‘బ్లాక్‌’ చేసి, కృత్రిమ కొరత సృష్టిస్తూ, అధిక ధరలకు విక్రయిస్తున్నారని పరిశ్రమ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని కంపెనీలు 3 నెలల నిల్వలు ఉంచుకుంటాయి. ఇటువంటి కంపెనీలకు ఇబ్బంది ఉండదు. అదే ప్రతి నెలా తెప్పించుకునే వారికి మాత్రం అధిక ధరల పోటు తప్పడం లేదు. చైనా నుంచి సరఫరాలు పెరగని పక్షంలో ఇబ్బందులు తప్పవు. వచ్చే నెలాఖరు వరకూ ఏదో విధంగా నెట్టుకురావచ్చని, ఆ తర్వాత కూడా రాకపోతే కష్టమని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

కంటెయినర్ల ఎదురు చూపులు

ప్రస్తుతం మనదేశానికి రావలసిన ఎన్నో కంటెయినర్లు చైనా, హాంకాంగ్‌ పోర్టుల్లో నిలిపి ఉన్నాయి. తగిన పత్రాలు సిద్ధం కాక (డాక్యుమెంటేషన్‌), నౌకలు బయలుదేరక వస్తువుల ఎగుమతులు, దిగుమతులు నిలిపోతున్నాయి. మనదేశంలో ముంబయి, కోల్‌కతా, చెన్నై పోర్టుల్లో దిగుమతిదార్లు చైనా నుంచి వచ్చే ఓడల కోసం ఎదురు చూడటంతోనే సరిపోతోంది.

గిరాకీ ఉన్న ఔషధాలకు వినియోగించే..

ఆస్తమా, ఎలర్జీ వ్యాధులను అదుపు చేసేందుకు వినియోగించే మాంటెలుకాస్ట్‌ సోడియం బల్క్‌ డ్రగ్‌ కిలో ధర ఈ కొద్దికాలంలోనే రూ.20,000 వరకు పెరిగింది. అజిత్రోమైసిన్‌, ఆమాక్సలిన్‌, ఆక్స్‌ఫాసిన్‌... తదితర యాంటీ బయాటిక్స్‌ ధర 20 శాతం నుంచి 30 శాతం వరకూ పెరిగినట్లు సంబంధిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పారాసెట్మాల్‌ ముడి ఔషధం కిలో ధర కూడా రూ.185 పెరిగింది. రక్తపోటు, గుండె జబ్బుల చికిత్సకు వినియోగించే ఔషధాలతయారీలో వినియోగించే బల్క్‌, ఇంటర్మీడియేట్స్‌ ధరలు కూడా పెరుగుతున్నట్లు చెబుతున్నారు. పెరిగిన వ్యయాలకు అనుగుణంగా తుది ఔషధాలు (ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్‌) ధరలను వెంటనే పెంచలేమని, తత్ఫలితంగా తమ మార్జిన్లపై ఒత్తిడి పెరిగిపోతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఔషధాల ధరలు
Last Updated : Mar 2, 2020, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details