చైనాలో పుట్టిన కరోనా వైరస్ మనదేశంలోనూ కలకలం సృష్టిస్తోంది. వివిధ పర్రిశమలను కలవరపరుస్తోంది. ముడి ఔషధాల కోసం చైనా మీద ఎక్కువగా ఆధారపడిన ఫార్మా పరిశ్రమ మరింత భయపడుతోంది. మందుల తయారీకి అవసరమైన పలు ముడి పదార్ధాలను ఇక్కడి ఫార్మా కంపెనీలు చైనా నుంచి కొనుగోలు చేస్తున్నాయి. వీటిని ఇక్కడి ఫార్మా కంపెనీలు తుది వినియోగానికి అనువైన ట్యాబ్లెట్లు, కేప్సుల్స్‌గా తయారు చేస్తున్నాయి. దాదాపు దేశీయ అవసరాల్లో 60-80 శాతం వరకూ చైనా నుంచి వస్తున్నవే. ఉదాహరణకు గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఫార్మా కంపెనీలు సుమారు రూ.17,000 కోట్ల విలువైన బల్క్, ఏపీఐ ఔషధాలను చైనా నుంచి దిగుమతి చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ఇక్కడి ఫార్మా కంపెనీలకు గుబులు పుట్టిస్తోంది. అక్కడి నుంచి మన అవసరాలకు తగ్గట్లుగా ముడి ఔషధాలు రావటం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు గత కొంతకాలంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఔషధ పరిశ్రమ విస్తరించింది. ఈ నగరాలకు దగ్గర్లో ఏర్పాటైన ఔషధ యూనిట్లు పలు దేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నాయి. బల్క్ ఔషధాలు ఇక్కడ సొంతంగా తయారు చేసుకోవటం కంటే చైనా నుంచి దిగుమతి చేసుకోవటం చౌక కావటం దీనికి ప్రధాన కారణం. గత కొంతకాలంగా చైనాలో పారిశ్రామిక కాలుష్యం బాగా పెరిగింది. దీంతో కాలుష్య నిబంధనలను అక్కడ కఠినతరం చేశారు. తత్ఫలితంగా రెండు, మూడేళ్ల నుంచి బల్క్ ఔషధాలు, ఏపీఐలు చైనా నుంచి రావటం తగ్గింది. ఎప్పటికీ ఇది సమస్యే కాబట్టి దేశీయంగానే బల్క్ ఔషధాల తయారీని పెంచాలని అటు ప్రభుత్వం, ఇటు పరిశ్రమ వర్గాలు మాట్లాడుతున్నాయి. కానీ ఆ దిశగా గట్టి అడుగులు పడటం లేదు. దేశంలో నాలుగైదు ప్రదేశాల్లో బల్క్ ఔషధ పార్కులు ప్రారంభించాలని, అందుకు ప్రభుత్వం ఉదారంగా నిధులు ఇవ్వాలని ఫార్మా పరిశ్రమ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఆ కసరత్తు ఇంకా పట్టాలెక్కక ముందే ఇప్పుడు కరోనా వైరస్ సమస్యతో బల్క్ ఔషధాల సమస్య తీవ్రతరంగా మారింది.
కరోనా వైరస్ సమస్యతో చైనా నుంచి బల్క్, ఏపీఐ ఔషధాల సరఫరా ఏమేరకు తగ్గుతుందనే విషయంలో ఈ నెల 10 తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందని స్ధానిక ఔషధ కంపెనీ అధిపతి 'ఈనాడు'కు వివరించారు. చైనాలో క్రిస్మస్, కొత్త సంవత్సర సెలవులు ఈ నెల 10 వరకూ పొడిగించారు. సెలవులు ముగిశాక అక్కడి నుంచి ఏ మేరకు మనకు అవసరమైన బల్క్, ఏపీఐ ఔషధాలు సరఫరా అవుతాయనేది తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైతే కొరత అంత కనిపించటం లేదు..., కానీ ఇదే సమస్య ఎక్కువ కాలం కొనసాగితే తీవ్రమైన ఇబ్బందులు తప్పవు, మందుల ధరలు కూడా పెరిగిపోతాయి- అన్నారాయన.
ఇదీ సమస్య తీవ్రత...
- చైనాలోని వుహాన్, ఝెజియాంగ్, జియాంగ్సు తదితర నగరాలకు సమీపంలో బల్క్ డ్రగ్స్, ఏపీఐలు అధికంగా తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు కరోనా వైరస్ ఫలితంగా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయి.
- విటమిన్లు, యాంటీ-బయాటిక్స్ తయారీలో వినియోగించే ఎన్నో ముడి ఔషధాలకు మనకు చైనా మీద అధికంగా ఆధారపడవలసిన పరిస్థితి ఉంది. గత రెండు మూడు వారాలుగా చైనా బల్క్ ఔషధాల దిగుమతులు క్షీణించాయి. మున్ముందు ఇంకా తగ్గొచ్చు.
- పెన్సిలిన్-జీ, పారాసెట్మాల్, అజిత్రోమైసిన్, మాంటెలుకాస్ట్.. తదితర ఔషధాల తయారీకి ముడి ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది.
- దేశీయ ఫార్మా కంపెనీల వల్ల ఉన్న ముడిపదార్థాల నిల్వలు 2, 3 నెలల అవసరాలకు మాత్రమే సరిపోతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి లోగా కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టని పక్షంలో ముడి ఔషధాల ధరలు పెరిగి, పలు రకాల మందుల ధరలు పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కల్లోలమే!