గతేడాది మాదిరిగానే ఈ ఏప్రిల్ నెలలో కూడా రాష్ట్ర ఖజానాపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పడుతోంది. ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే రాష్ట్ర రాబడులపై కరోనా పంజా విసిరింది. పదిరోజులుగా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండడం, రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుండడంతో ఆ ప్రభావం వివిధ రంగాలపై పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తెచ్చే వాణిజ్య పన్నుల శాఖ రాబడులపై కరోనా ప్రభావం మొదలైంది. దీంతో వ్యాట్, జీఎస్టీ రాబడులు తగ్గినట్లు పేర్కొంటున్న అధికారులు... దీని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
విక్రయాలు పడిపోయాయి..
రాష్ట్ర రాబడులపై భారీ అంచనాలతో ఉన్న ఆర్థిక, వాణిజ్య వర్గాలు మొదటి నెల రాబడుల ప్రభావంపై సమీక్ష చేస్తున్నాయి. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రాష్ట్ర ఖజానాకు గత ఆర్థిక ఏడాది రూ.52,436.21 కోట్లు రాగా... ఈ ఏడాది రాబడిని ప్రభుత్వం భారీగా అంచనా వేసింది. తాజాగా కరోనా తీవ్ర స్థాయిలో ఉండడంతో అమ్మకాలు, రవాణా, నిర్మాణ రంగంతో సహా పలు రంగాలపై ఆ ప్రభావం పడింది. గత పది రోజులుగా అమ్మకాలు గణనీయంగా తగ్గుతున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా పెద్ద మొత్తంలో రాబడులు వచ్చే కీలకమైన వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాలు పడిపోయాయని గుర్తించారు. పర్యాటక, వినోదం విభాగాలు మూతపడటంతో పన్ను రాబడి ఘనణీయంగా తగ్గుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వైద్యం, ఆహారపదార్ధాల కొనుగోలు తప్పా... ఇతరత్రా కొనేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు.
పరిస్థితి పూర్తిగా మారిపోయింది..
గతేడాది ఏప్రిల్ నెలలో కరోనా ప్రభావంతో రూ. 932.54 కోట్లు మాత్రమే వచ్చింది. మే నెలలో రూ. 1,567.22 కోట్లు రాగా... లాక్డౌన్ ఎత్తివేయడంతో రాబడులు క్రమంగా పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మొదటి పది రోజులు మినహా ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు అధికారులు తెలిపారు. అన్ని రంగాలపై ఈ ప్రభావం పడటమే కాకుండా... క్రమంగా పెరుగుతోందని అంచనా వేశారు. ఇలానే కొనసాగితే వచ్చే నెలలో ఈ ప్రభావం మరింత ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.