బంగారం ధర గత ఐదు రోజుల్లో 700 రూపాయలకు పైగా పెరిగింది. హైదరాబాద్‌లో 5 రోజుల క్రితం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 42,300 ఉంది. ప్రస్తుతం రూ.43వేలు దాటింది. నెల రోజులుగా చూస్తే పసిడి ధర రూ.1700 వరకు పెరిగి ఏడేళ్ల గరిష్ఠానికి చేరుకుంది.
ఎందుకీ పెరుగుదల?
బంగారం ధర అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముడిచమురు ధరలు, డాలరు విలువ, ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఫెడ్ వడ్డీ రేట్లు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. వాణిజ్య యుద్ధం, మధ్య ఆసియా పరిస్థితులూ ధరల హెచ్చుతగ్గులకు కారణమవుతాయి.ప్రస్తుత పెరుగుదల కరోనా భయాల వల్ల వచ్చినప్పటికీ.. అంతకుముందు నుంచీ బంగారం ధర పెరుగుతూనే ఉందని నిపుణులు చెబుతున్నారు.
కరోనా వైరస్ కంటే ముందే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ దేశాల్లో తక్కువ వడ్డీ రేట్లు ఉన్న కారణంగా భౌతిక ఆస్తులపై పెట్టుబడికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. బంగారం కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా కొంతకాలం నుంచి బంగారం ధర పెరుగుతోంది.
"సాధారణంగానే బంగారం ధరల్లో పెరుగుదల ఉంది. ఇప్పుడు కరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబధించిన భయాలతో మరింత పెరుగుతోంది. సమస్య ఇంకా పెద్దదైతే ర్యాలీ కొనసాగవచ్చు. దీనిపై కొన్ని వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కరోనా సమస్య పరిష్కారమైతే.. స్వల్పకాలంలో ర్యాలీ ఆగిపోవచ్చు లేదా కొద్దిగా తగ్గిపోవచ్చు. కొన్ని దేశాల్లో వడ్డీ రేట్లు రుణాత్మకం లేదా తక్కువున్న దృష్ట్యా దీర్ఘ కాలంలో ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది."