తెలంగాణ

telangana

ETV Bharat / business

కన్నీరు పెట్టిస్తోన్న ఉల్లి- కిలోకు రూ.100కుపైనే.. - ఉల్లి ధరలు

ఉల్లి పంటపై భారీ వర్షాలు ప్రభావం చూపడం వల్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కొద్ది రోజుల వరకు రూ.100కే 8 కిలోలు లభించిన ఉల్లిపాయలు.. ప్రస్తుతం కేజీ దొరకటం కూడా కష్టమైపోతోంది. కొత్త పంట వచ్చే వరకూ ఈ తిప్పలు తప్పవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

price of onion soars
ఉల్లి

By

Published : Oct 21, 2020, 5:21 AM IST

ఉల్లి ధరలు మరోసారి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కొద్ది రోజుల వరకూ వంద రూపాయలకు 7-8 కేజీల వరకూ లభించిన ఉల్లిపాయలు ఇప్పుడు కేజీ దొరకటం కూడా గగనమవుతోంది. భారీ వర్షాలు ఉల్లిపంటలపై తీవ్ర ప్రభావం చూపటంతో కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగాయని డీలర్లు చెబుతుంటే... కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. కొత్త పంట వచ్చే వరకూ ఈ తిప్పలు తప్పవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కిలో రూ.100 నుంచి రూ.120కి..

దేశవ్యాప్తంగా.. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల ప్రభావంతో ఉల్లి పంట మునిగిపోవడం, ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండటం, ఏరడానికి అనుకూలంగా లేకపోవడంతో నేలలోనే ఉల్లి కుళ్లిపోయింది. ఫలితంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడం వల్ల రైతులు నిలువునా నష్టపోవాల్సి వచ్చింది. సరఫరా నిలిచిపోయిన కారణంగా మార్కెట్‌లో అమాంతం ధరలు పెరిగిపోయాయి. ఏకంగా కిలో ఉల్లిగడ్డ ధర రూ.100 నుంచి రూ.120 ఎగబాకిపోవడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.

వినియోగదారుల వెతలు

ఇక దక్షిణాదిలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు మళ్లీ ఉన్న పంట కూడా దెబ్బతింటుందని, మార్కెట్‌కు సరుకు రావడం లేదని వ్యాపార సంఘాల సభ్యులు చెబుతున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఉన్న ఉల్లిని నిల్వ చేసుకునే ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోతే.. వినియోగదారులపై ఆర్థిక భారం తప్పదని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. ఉల్లి ధరలు పెరగడం వల్ల ఇంట్లో కూర వండుకోలేని పరిస్థితి నెలకొందని వినియోగదారులు వాపోతున్నారు. మార్కెట్లో ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుబడులు తగ్గాయని అధికారులు చెబుతున్నారు.

అధిక ఉత్పత్తి ఉన్నప్పటికీ సమస్యలు..

వాస్తవానికి దేశంలో ఉల్లిని అవసరాలకు మించి సాగు చేస్తున్నారు. ఈ కారణంగానే అన్నిచోట్లా పంట చేతికి వచ్చేసరికి ధరలు భారీగా పడిపోతుంటాయి. చివరికి రైతుకు రవాణా ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో కిలో రూ.2, రూ.3కు విక్రయించిన సందర్భాలు కోకొల్లలు. దేశంలో మొత్తం 22 మిలియన్ల టన్నులకు పైగా ఉల్లి పండుతుండగా.. వాటిలో 15.5 మిలియన్‌ టన్నుల మేర మాత్రమే వినియోగిస్తున్నాం. మిగిలిన వాటిలో చాలా వరకు పొరుగున ఉన్న చిన్న దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పొరుగు దేశాలతో పోల్చితే భారత్‌లో ఉల్లి వినియోగం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. చైనాలో ప్రతి పౌరుడూ ఏడాదికి సగటున 16 కిలోల ఉల్లిపాయల్ని వినియోగిస్తుండగా, పాకిస్థాన్‌లో 10.35, శ్రీలంకలో 15, బంగ్లాదేశ్‌లో 12.5 వినియోగం ఉంది. కానీ భారత్‌లో సగటున 19 కిలోల మేర వినియోగిస్తున్నారు.

7 రాష్ట్రాల్లోనే 80శాతం సాగు..

ప్రస్తుతం ఉల్లిగడ్డలకు దేశమంతటా గిరాకీ ఉన్నా...ఉత్పత్తి మాత్రం కొన్ని రాష్ట్రాలకే పరిమితం. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, బిహార్‌లలోనే 75% ఉల్లి పంట సాగు అవుతోంది. అందులోనూ ఒక్క మహారాష్ట్రే 30% ఉల్లి సాగుచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలను కలిపితే 7 రాష్ట్రాల్లోనే 80 శాతం ఉల్లి సాగవుతోంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఉల్లి సాగు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి ఈ గణాంకాలు. ప్రస్తుతం ఉల్లి దిగుబడిలో 20% మాత్రమే సక్రమంగా నిల్వ చేయగలుగుతున్నారు. 30-40% పంట సరైన నిల్వ సౌకర్యాలు లేక పాడవుతోంది.

శాశ్వత మార్గమేదీ..?

ఉల్లి ధరలు పదేపదే చుక్కలు తాకడానికి కారణాలు, శాశ్వత పరిష్కారాలు కనుగొనేంతవరకు అవి జనం జేబుకు చిల్లు పెడుతూనే ఉంటాయి. కొరత ఏర్పడి ధరలు మండినప్పుడు ఉల్లి ఎగుమతులను నిషేధించి, హడావుడిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం పరిపాటిగా మారింది. సమస్య తగ్గగానే... ఆ విషయం విస్మరించటమూ అలవాటైపోయింది. అసలు ఉల్లి ధరలు పెరిగినా తరిగినా రైతుకు లాభం ఉండటం లేదు.

పేదలు ఆహారంలో ఉల్లిపాయల వాడకం మానేయడం మినహా ఏమీ చేయలేని స్థితి. ఉల్లి ధరల పెరుగుదల వల్ల లాభపడుతున్నది అక్రమ నిల్వదారులు, నల్లబజారు వర్తకులు మాత్రమే. పంట వల్ల వచ్చే లాభాల్లో అత్యధిక వాటాను అక్రమ నిల్వదారులు, దళారులే చేజిక్కించుకొంటున్నారు. వినియోగ దారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా రైతుల ఆదాయాలను పెంచడానికి ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం లేదు.

ఇదీ చూడండి:దేశంలో తొలిసారి ఇంగువ సాగు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details