అత్యవసర ఆర్థిక అవసరాలు, అనుకోకుండా వచ్చే ఖర్చులను అధిగమించేందుకు పర్సనల్ లోన్ తీసుకుంటుంటాం. అయితే.. ఇలా వ్యక్తిగత రుణం పొందే ముందు బ్యాంకుల సూచనలు, ఆఫర్లను క్షుణ్నంగా అర్థం చేసుకోవాలి. ఏ మాత్రం పొరపాటు జరిగినా చిక్కుల్లో పడాల్సి వస్తుంది. మరి ఆ జాగ్రత్తలు ఏమిటనేది ఓ సారి పరిశీలిస్తే..
క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి
ఏ బ్యాంకుకైనా వ్యక్తిగత రుణం కోసం వెళ్లగానే వారు మొట్టమొదట చేసేది మన క్రెడిట్ స్కోర్‌ని చూడటం. కొన్ని బ్యాంకుల్లో వారి సొంత విధానాలను వినియోగించి వ్యక్తి రుణ అర్హతను ధ్రువీకరించుకుంటారు. అందుకే క్రెడిట్ స్కోర్ తగ్గకుండా చూసుకోవాలి. 750 కంటే అధిక స్కోర్ ఉన్నవారికి రుణం మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన ఆర్థిక కార్యకలాపాలను బట్టి ఇది మారుతూ ఉంటుంది. సకాలంలో వాయిదాలు చెల్లించడం, క్రెడిట్ కార్డు బిల్లు గడువులోగా చెల్లించడం వంటి చర్యల వల్ల మంచి స్కోర్ మెయింటైన్ చేయవచ్చు. క్రెడిట్ స్కోర్‌ను తరచూ చెక్ చేసుకోవాలి. తద్వారా ఒకవేళ ఎక్కడైనా తప్పులు దొర్లినా సవరించుకునే వీలుంటుంది.
తిరిగి చెల్లించే సామర్థ్యానికి అనుగుణంగా గడువు ఎంపిక
ఖాతాదారులు రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బ్యాంకులు లేదా ఫినాన్స్ సంస్థలు.. ఖాతాదారులకు ఉన్న రుణాల ఆధారంగా అంచనా వేస్తాయి. ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉన్న వారు రుణాన్ని ఎగవేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ వాయిదాల కోసం చెల్లించే మొత్తం ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. తద్వారా రుణం పొందటం సులభమవుతుంది.
అవసరమైతేనే.. అవసరం ఉన్నంతే..
ఇతర రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణాలు పొందడం కాస్త తేలిక. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే ఎక్కువ మొత్తంలో ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపుతాయి. కొన్ని ఆఫర్లను ఇవ్వడానికి కూడా ముందుకు వస్తాయి. అలాంటి సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. మీరు తిరిగి చెల్లించే స్తోమత, భవిష్యత్ ఖర్చులు, మీ బాధ్యతలు, ఇతర రుణాలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎంత తీసుకోవాలో నిర్ణయించుకోండి. మీ తక్షణ అవసరానికి ఎంత కావాలో అంతే తీసుకోవడం ఉత్తమం. వీలైతే ఆన్‌లైన్‌లో అనేక ఈఎంఐ కాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకోవచ్చు. మీ నెలవారీ ఆదాయంలో ఈఎంఐల వాటా 40%-50% మించకుండా చూసుకోవడం ఉత్తమం.
మార్కెట్ అధ్యయనం
మీ ఆర్థిక పరిస్థితి, క్రెడిట్ స్కోర్ బాగుంటే చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఆయా సంస్థలు ఇస్తున్న ఆఫర్లు ఏంటో కనుక్కోండి. అవి ఎంత వరకు లాభదాయకమో చూడండి. అవసరమైతే ఆర్థిక నిపుణుల్ని సంప్రదించండి. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు కనుక్కొని పోల్చి చూడండి. ప్రాసెసింగ్ ఫీజు వంటి ఇతరత్రా ఖర్చులను ఆరా తీయండి. వీటన్నింటినీ బేరీజు వేసుకుని తక్కువ ఖర్చుతో ఇచ్చే నమ్మకమైన సంస్థ వద్ద రుణం తీసుకోండి. తక్కువ వడ్డీరేటు కోసం వారితో బేరాలాడే అవకాశం ఉంటుందని మరవొద్దు.