Union budget 2022: కేంద్ర బడ్జెట్‌పై సాధారణ ప్రజల ఆశలు ఈసారి అధికంగానే ఉన్నాయి. ముఖ్యంగా కరోనా వేళ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు.. ఆదాయపు పన్ను విషయంలో ఎలాంటి హామీలు లభిస్తాయో అన్నదే చాలామందికి ఆసక్తి కలిగించే అంశం. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పిస్తున్న వేళలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమకు ఏ వరాలు ఇస్తారో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఎంతోకాలంగా పన్నుల విషయంలో కావాల్సినంత ఊరట లభించడం లేదు. ఆదాయపు పన్ను విషయంలో ఈసారి కచ్చితంగా మార్పులు రావాలనేది ఎక్కువమంది కోరిక.
పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షలకు రూ.200 మించినా.. రూ.13,000 వరకూ పన్ను చెల్లించాల్సిన పరిస్థితి. ఈసారి బడ్జెట్‌లో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారా అనేది చాలామంది ఎదురుచూస్తున్నారు. రూ.5లక్షలకు మించి కొంత మొత్తం అదనంగా ఉన్నా పన్ను వర్తించకుండా ఏర్పాటు ఉండాలని కోరుతున్నారు.
మినహాయింపు పెంచుతారా?
ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 వరకూ సెక్షన్ 80సీలో భాగంగా మదుపు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈపీఎఫ్, వీపీఎఫ్, పీపీఎఫ్, జీవిత బీమా, ఇంటిరుణం అసలు, ఈఎల్‌ఎస్‌ఎస్‌లు, పన్ను ఆదా ఎఫ్‌డీలు, పిల్లల ట్యూషన్ ఫీజులు ఇలా ఎన్నో ఇందులో భాగంగానే ఉన్నాయి.
2014 నుంచి దీన్ని మార్చింది లేదు. అప్పటి నుంచీ ఇప్పటికీ ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రజల కొనుగోలు శక్తిలోనూ 25శాతం మేరకు వృద్ధి ఉందని నివేదికలు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణమూ అధికంగానే ఉంది. 2014 లెక్కల్లో చూస్తే రూ.1.50లక్షలు సరిపోయింది. కానీ, ఇప్పుడు కనీసం రూ.2.50లక్షల వరకూ మినహాయింపుల పరిమితి పెంచాల్సిందేనని ప్రజలు కోరుతున్నారు.
ప్రామాణిక తగ్గింపులో..
ఆరోగ్య ఖర్చులు, ప్రయాణ ఖర్చుల తిరిగి చెల్లింపులాంటి వాటికి ఇచ్చే మినహాయింపులను సులభతరం చేయడం కోసం ప్రామాణిక తగ్గింపును రూ.50వేలు చేశారు. కరోనా మహమ్మారితో ప్రతి ఇంట్లో ఆరోగ్య ఖర్చులు ఎంతగానో పెరిగాయి. ఇంటి నుంచి పని, శుభ్రత ఖర్చులు, ముందస్తు ఆరోగ్య పరీక్షలు, ద్రవ్యోల్బణం ఇలా ఎన్నో అంశాలు ఈ ప్రామాణిక పరిమితికి మించి ఖర్చు పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ మొత్తాన్ని రూ.75,000- రూ.1,00,000 చేయాలని విన్నవిస్తున్నారు.