పన్ను రహిత(టాక్స్-ఫ్రీ) మద్యం కొనుగోలును ఒక బాటిల్‌కే పరిమితం చేయాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సిఫార్సు చేసింది. అనవసర వస్తువుల దిగుమతులను తగ్గించే చర్యల్లో భాగంగానే ఈ సిఫార్సు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
టాక్స్ ఫ్రీ షాపుల్లో సిగరెట్ డబ్బాలు కొనడాన్ని కూడా నిషేధించాలని వాణిజ్యమంత్రిత్వశాఖ... ఆర్థికమంత్రిత్వశాఖకు సూచించింది. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఈ ప్రతిపాదనలు చేసింది.
ఒక లీటర్ మద్యం, ఒక సిగరెట్ డబ్బా
ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న (ఇన్‌బౌండ్) విదేశీ ప్రయాణికులు ఈ టాక్స్ ఫ్రీ దుకాణాల నుంచి 2 లీటర్ల మద్యం, ఒక సిగరెట్ డబ్బా కొనడానికి అనుమతి ఉంది. అయితే చాలా దేశాలు... విదేశీ ప్రయాణికులకు కేవలం ఒక లీటర్ మద్యం మాత్రమే కొనడానికి అనుమతిస్తున్నాయి. ఇప్పుడు దీనినే భారత్‌లోనూ అమలు చేయాలని వాణిజ్యమంత్రిత్వశాఖ సిఫార్సు చేసింది.
వాణిజ్యలోటు తగ్గింపే లక్ష్యం
వాణిజ్యలోటును తగ్గించేందుకు.. అనవసర వస్తువుల దిగుమతిని తగ్గించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం వివిధ మార్గాలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో వాణిజ్యమంత్రిత్వశాఖ సిఫార్సులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
డ్యూటీ ఫ్రీ షాఫ్?
డ్యూటీ ఫ్రీ దుకాణంలో... భారత్‌లో పర్యటిస్తున్న విదేశీ ప్రయాణికులు దిగుమతి సుంకం చెల్లించకుండానే సుమారు రూ.50,000 విలువైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
మేక్ ఇన్ ఇండియా కోసం
కాగితం, పాదరక్షలు, రబ్బరు వస్తువులు, బొమ్మలు వంటి అనేక ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు పెంచాలని వాణిజ్యమంత్రిత్వశాఖ సూచించింది. గృహోపకరణాలు, రసాయనాలు, రబ్బరు, కోటెడ్ పేపర్, పేపర్ బోర్డులతో సహా వివిధ రంగాలకు చెందిన 300కిపైగా వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాలను హేతుబద్ధీకరించాలని ప్రతిపాదించింది. 'మేక్ ఇన్ ఇండియా'ను ప్రోత్సహించడానికి, భారత ఉత్పాదక శక్తిని పెంచడానికి ఇది తప్పనిసరి అని అభిప్రాయపడింది.
ఇదీ చూడండి: ఈపీఎఫ్ యూనిఫైడ్ పోర్టల్‌తో పొందగలిగే సేవలు ఇవే