తెలంగాణ

telangana

ETV Bharat / business

వారాంతంలో మార్కెట్లకు భారీ నష్టాలు

స్టాక్​మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో నష్టాలతో సూచీలు డీలాపడ్డాయి. సెన్సెక్స్​ 192 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 11 వేల 800 పాయింట్ల దిగువకు చేరింది.

వారాంతంలో మార్కెట్లకు భారీ నష్టాలు

By

Published : Jun 28, 2019, 4:04 PM IST

ప్రెవేటు రంగ బ్యాంకు షేర్ల క్షీణతతో.. స్టాక్​మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతోనే ముగిశాయి. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఐసీఐసీఐ, ఇండస్​ఇండ్​, కోటక్​ మహీంద్రా, యస్​ బ్యాంక్​లు నష్టాలను నమోదు చేశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్​ 192 పాయింట్లు కోల్పోయింది. చివరకు 39 వేల 395 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 53 పాయింట్లు క్షీణించింది. 11 వేల 800 దిగువకు చేరి.. 11 వేల 789 వద్ద సెషన్​ను ముగించింది.

మొత్తం 1147 షేర్లు పుంజుకున్నాయి. 1354 షేర్లు పతనమయ్యాయి. 158 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

ఫార్మా, ఇన్​ఫ్రా, ఐటీ, పీఎస్​యూలకు కొనుగోళ్ల మద్దతు లభించగా.. లోహరంగం ఒత్తిడికి గురైంది. మిడ్​, స్మాల్​ క్యాప్​ షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

ఇంట్రాడే సాగిందిలా...

ఆరంభట్రేడింగ్​లో 39 వేల 630 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్​.. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో ఒడుదొడుకులకు లోనైంది. ఒకానొక దశలో 150 పాయింట్లకు పైగా పతనమైంది. అనంతరం.. ఏ దశలోనూ లాభాల దిశగా పయనించలేదు. 39 వేల 675 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరకు 192 పాయింట్ల నష్టంతో 39 వేల 395 వద్ద ముగిసింది.

నిఫ్టీ.. 11, 775-11, 871 మధ్య కదలాడింది. చివరకు 53 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది.

లాభనష్టాల్లోనివివే...

యాక్సిక్​ బ్యాంక్​, బజాజ్​ ఫినాన్స్​, మారుతీ సుజుకీ, గెయిల్​ ఉత్తమ లాభాలతో ముగించాయి. యస్​ బ్యాంక్​, కోల్​ ఇండియా, భారతీ ఇన్​ఫ్రాటెల్​లు డీలా పడ్డాయి.

నిఫ్టీలో రంగాల వారీగా చూస్తే.. ప్రభుత్వరంగ బ్యాంకులు రాణించాయి. 0.67 శాతం వృద్ధి సాధించాయి. లోహరంగం.. ఎక్కువ నష్టాలను చవిచూసింది. 1.13 శాతం కోల్పోయింది.

ABOUT THE AUTHOR

...view details