బ్యాంకులకు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు ఆడిటర్ల నియామకంపై ఆర్‌బీఐ ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించాలని సీఐఐ (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) కోరింది. ఆ సర్క్యులర్ కారణంగా కొవిడ్ సమయంలో ఎన్‌బీఎఫ్‌సీలకు ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొంది. ఆర్‌బీఐ గతనెల 27వ తేదీన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఆడిటర్ల నియామకంపై కొన్ని నిబంధనలు విధించింది. దీంతోపాటు ఆడిటర్ల రీ అపాయింట్‌మెంట్‌కు కొంతకాల వ్యవధిని ఏర్పాటు చేసింది. దీనిపై సీఐఐ స్పందించింది.
'ఈ నిబంధనల కారణంగా కంపెనీలకు ఇబ్బందులు పెరుగుతాయి. ఆ ప్రభావం పరిశ్రమపై పడుతుంది. ఆడిట్స్ సంఖ్యపై నిబంధనలు, జాయింట్ ఆడిట్లు, రొటేషన్ నిబంధనలు వంటివి వాణిజ్య బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు వర్తింపచేసి ఉండకూడదు. ఎటువంటి నిబంధనలు మార్చకుండా కూడా ఆర్‌బీఐ తన లక్ష్యాలను చేరుకోవచ్చు' అని సీఐఐ పేర్కొంది. అంతేకాదు ఈ మార్పులు అస్థిరమైన పాలసీలకు పునాదులు వేస్తాయని విమర్శించింది.