'చైనా నుంచి దిగుమతులు తగ్గించుకోండి'.. భారత్-చైనా సరిహద్దులో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన కొన్ని రోజుల అనంతరం కంపెనీలకు భారత ప్రభుత్వం చేసిన సూచన ఇది. అదంత సులువేనా.. అంటే కాదనే అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఔషధ రంగంలో.
చైనా ఉత్పత్తులపై మనం బాగా ఆధారపడి ఉన్నాం. అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే అంత చౌకగా ఎక్కడా దొరకవు. ఇదేదో చైనా మీద ప్రేమతో కాదు.. వేరే దేశాల నుంచి ఆయా ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటే.. ఇక్కడ ధరలు ఆ మేరకు పెరుగుతాయి. అది ఇష్టం లేక.. పోటీని తట్టుకోవడం కోసం మన కంపెనీలు చైనాపై ఆధారపడుతూ వస్తున్నాయి.
ఎంతలా ఆధారపడి ఉన్నామంటే..
ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగపడే యాక్టివ్ ఫార్మా ఇంగ్రేడియంట్ల(ఏపీఐ) విషయంలోనూ మనం ఆ దేశంపైన ఆధారపడే ఉన్నాం. ఒక విధంగా భారత ఫార్మా రంగం అభివృద్ధికి చైనా సరఫరాలు కీలకమనే చెప్పాలి. మనం చౌకగా ఫార్మా జనరిక్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ.. పరిమాణం పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఫార్మా దేశంగా అవతరించాం.
ప్రపంచవ్యాప్త ఎగుమతుల్లో మన దేశం వాటా 60 శాతం అంటే మన స్థానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఒక్క 2018-19లోనే 14.35 బిలియన్ డాలర్ల విలువైన ఫార్ములేషన్లను; 3.91 బిలియన్ డాలర్ల విలువైన బల్క్ ఔషధాలను ఎగుమతి చేశాం.. అయితే.. చాలా వరకు ఔషధాల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను మనం దిగుమతి చేసుకుంటాం. ఆ దిగుమతుల్లో చైనా వాటా 60 శాతం కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం. 2018-19 విషయానికే వస్తే.. మనం దిగుమతి చేసుకున్న 3.56 బిలియన్ డాలర్ల విలువైన బల్క్ డ్రగ్స్ లేదా ఏపీఐలలో 68 శాతం వాటా చైనాదే.
ఏవేవి దిగుమతులు
- మెటాఫార్మిన్, విటమిన్ బి1, బి2, ఎరిత్రోమైసిన్, టినిడజోన్, పొటాషియం క్లావులాంట్ వంటి వాటి కోసం మనం దాదాపు పూర్తిగా చైనాపైనే ఆధారపడి ఉన్నాం.
- పారాసిటమాల్, సిఫాలోస్పోరిన్, పెన్సిలిన్ వంటి ఔషధాలకు మనం ఇంటర్మీడియటరీలను ఉత్పత్తి చేయడం లేదు. చైనా నుంచే తెప్పించుకుంటున్నాం.
- పలు బాక్టీరియా ఇన్ఫెక్లన్ల చికిత్సకు ఉపయోగించే ఎరిత్రోమైసిన్ తయారీలో ముడి పదార్థాలు, ఇంటర్మీడియట్లకు చైనాను కీలక సరఫరాదారు.
- పలు ఇన్ఫెక్షన్ల చికిత్సలో ఉపయోగించే పొటాసియమ్ క్లావులెంట్ విషయంలో పూర్తిగా చైనాపైనే ఆధారపడి ఉన్నాం.