తెలంగాణ

telangana

ETV Bharat / business

'దీదీ'కి ఒక్కరోజులో రూ.1.64లక్షల కోట్లు నష్టం - దీదీ క్యాబ్ సర్వీసులు

సైబర్​ భద్రత పేరిట సొంత దేశంలోని కార్పొరేట్ కంపెనీలను గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు చైనా పావులు కదుపుతోంది. 'దీదీ గ్లోబల్‌'అనే క్యాబ్‌ సేవల సంస్థపై ఆంక్షలు విధించింది. అప్లికేషన్‌ స్టోర్ల నుంచి దీదీ యాప్‌ను తొలగించాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో దీదీ షేర్లు 30 శాతం పడిపోయి దాదాపు రూ.1.64 లక్షల కోట్లు కోల్పోయింది.

didi
దీదీ

By

Published : Jul 7, 2021, 6:27 PM IST

దేశ భద్రత నెపంతో సొంత దేశ కార్పొరేట్‌ కంపెనీలపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా సైబర్‌ భద్రత పేరిట సంస్థల్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు కొత్త నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమైంది.

ఆ కంపెనీలే లక్ష్యంగా..

ముఖ్యంగా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో నమోదవుతున్న కంపెనీలను షీ జిన్‌పింగ్‌ నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఈ మేరకు మంగళవారం భేటీ అయిన చైనా కేబినెట్‌.. బడా కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసింది. లిస్టింగ్‌ పేరిట కీలక సమాచారాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్నారని.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పింది.

కొత్త నిబంధనల ప్రకారం.. ఇతర దేశాలకు తరలించే సమాచారంపై ప్రభుత్వ నియంత్రణ మరింత కఠినమవనుంది. స్టాక్‌ మార్కెట్లలో జరుగుతున్న మోసాలు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, మార్కెట్‌ మానిపులేషన్‌ను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని కేబినెట్‌ తెలిపింది. ఇంతకు మించి వివరాలేవీ ప్రకటించనప్పటికీ.. ఫిన్‌టెక్‌ నుంచి రుణాలిచ్చే ఆర్థిక సంస్థల వరకు ప్రతి కార్పొరేట్‌ కంపెనీపై చైనా ప్రభుత్వం నియంత్రణ పెరగనుందని స్పష్టమవుతోంది.

సైబర్‌భద్రత నెపంతో..

గతంలో దేశ భద్రత పేరిట టెన్సెంట్‌‌, అలీబాబా కంపెనీలపై విరుచుపడ్డ డ్రాగన్‌ ఇప్పుడు సైబర్‌భద్రత నెపంతో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా క్యాబ్‌ సేవలు అందించే 'దీదీ గ్లోబల్‌'పై ఆంక్షలు ఈ కోవలోకి వచ్చేవే.

సైబర్‌ సెక్యూరిటీ రివ్యూ నేపథ్యంలో నూతన రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం సహా చైనాకు చెందిన అప్లికేషన్‌ స్టోర్ల నుంచి దీదీ యాప్‌ను తొలగించాలని చైనా ప్రభుత్వం దీదీ గ్లోబల్‌కు తెలియజేసింది. జూన్‌ 30న న్యూయార్క్‌లో ఐపీఓకు వెళ్లిన దీదీ గ్లోబల్‌ దాదాపు 4.4 బిలియన్‌ డాలర్లను సమీకరించింది.

ఇంతలోనే చైనా ఆంక్షలు ప్రారంభం అయినందువల్ల దీదీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. మంగళవారం దీదీ షేర్లు 30 శాతం పడిపోయి ఓ దశలో 10.98 డాలర్లకు చేరింది. ఇది ఐపీఓ ధర 14 డాలర్ల కంటే తక్కువ. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో ఏకంగా 22 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.64 లక్షల కోట్లు) హరించుకుపోయాయి.

అభద్రతలోకి కంపెనీలు..

జాక్‌మాకు చెందిన యాంట్‌ గ్రూప్‌ యూఎస్‌ ఐపీఓ నవంబరులో అడ్డుకోవడంతో చైనా కార్పొరేట్‌ నియంత్రణా చర్యలు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి అమెరికా మార్కెట్లలో చైనా కంపెనీలు ఇప్పటి వరకు 44 బిలియన్ డాలర్ల(దాదాపు 3.29 లక్షల కోట్ల) సంపదను కోల్పోయాయి. దీదీపై విధించిన తాజా ఆంక్షల వల్ల దాని అనుబంధ సంస్థలైన ఉబెర్‌, ఫుల్‌ ట్రక్‌ అలయన్స్‌, కంఝున్ లిమిటెడ్‌ షేర్లు సైతం ఒత్తిడికి గురవుతున్నాయి. చైనాకు చెందిన ఇతర టెక్‌ సంస్థల షేర్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో చైనాలోని అనేక కార్పొరేట్‌ కంపెనీలు అభద్రతలోకి జారుకుంటున్నాయి.

అమెరికా మార్కెట్లలో నమోదైన చైనా కంపెనీలపై విరుచుకుపడుతున్న డ్రాగన్‌ ప్రభుత్వ చర్యల వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కార్పొరేట్‌ లీడర్లను తన గుప్పిట్లో పెట్టుకోవడం ఒకటైతే.. ఆంక్షల వల్ల వచ్చే నష్టాల్ని అమెరికా మదుపర్లపైకి నెట్టాలన్నది మరొకటని నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి :చైనాలో మరో ఆదిమ మానవుడి ఆచూకీ

ABOUT THE AUTHOR

...view details