దేశ భద్రత, సైబర్ సెక్యూరిటీ పేరిట బడా సాంకేతిక సంస్థలపై విరుచుకుపడుతున్న చైనా.. తాజాగా మరో 25 యాప్‌లను తొలగించాలని యాప్ స్టోర్లను ఆదేశించింది. అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రముఖ క్యాబ్ సేవల కంపెనీ 'దీదీ గ్లోబల్' యాప్‌ను తొలగించింది. తాజాగా అదే 'దీదీ'కి చెందిన మరో 25 అనుబంధ యాప్‌లను కూడా తొలగించాలని సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది. ఇతర దేశాల స్టాక్ మార్కెట్లలో నమోదైన కంపెనీలపై నిఘా కొనసాగుతుందని గత వారం చైనా పేర్కొంది. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు పేరిట చైనీయులకు చెందిన కీలక సమాచారాన్ని విదేశాలకు తరలిస్తున్నారన్నది చైనా ప్రభుత్వ ఆరోపణ.
కొత్త సైబర్ నిబంధనల పేరిట.. ఇతర దేశాలకు తరలించే సమాచారంపై ప్రభుత్వ నియంత్రణ మరింత కఠినతరం చేసేందుకు చైనా సిద్ధమైంది. గతంలో దేశ భద్రత పేరిట టెన్సెంట్, అలీబాబా కంపెనీలపై విరుచుపడ్డ డ్రాగన్ ఇప్పుడు సైబర్‌భద్రత నెపంతో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.