2019లో చైనా జీడీపీ 6.1 శాతం వృద్ధిచెందింది. గడచిన మూడు దశాబ్దాల్లోనే ఇది అత్యంత కనిష్ఠం కావడం.. మందగిస్తున్న చైనా ఆర్థికవ్యవస్థకు తార్కాణం. బలహీనమైన దేశీయ డిమాండ్‌కు తోడు అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగడమే ఇందుకు కారణమని అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి.
ప్రాభవం తగ్గుతోంది!
చైనా జాతీయ గణాంకాల సంస్థ (ఎన్బీఎస్) ప్రకారం... ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా 2019లో 6.1 శాతం జీడీపీ వృద్ధిరేటు నమోదు చేసింది. నిజానికి బీజింగ్ అధికారిక లక్ష్యం 6.0 నుంచి 6.5 శాతం మాత్రమే. అయితే 2018లో 6.6 శాతంగా ఉన్న చైనా జీడీపీ వృద్ధిరేటు 2019లో 6.1 శాతానికి పడిపోవడం గమనార్హం.