తెలంగాణ

telangana

ETV Bharat / business

దంతేరస్:​ పసిడి కొంటున్నారా.. ఈ ఐదూ సరిచూసుకోండి

ధనత్రయోదశి (దంతేరస్​)కి బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. దీపావళికి ముందు పసిడి కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందనేది కొందరి నమ్మకం. ఈ పండగ సీజన్​లోనే కాదు ఎప్పుడు బంగారం కొనుగోలు చేసినా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మేలు..

బంగారం కొనుగోలులో ఆ ఐదూ సరిచూసుకోండి

By

Published : Oct 25, 2019, 8:23 AM IST

ధనత్రయోదశి...అనగానే బంగారం ఎంతో కొంత కొనాలి అనుకుంటాం. ఇప్పుడే కాదు... పసిడి ఎప్పుడు కొన్నా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటంటే...

స్వచ్ఛత..

బంగారు ఆభరణాలు కొంటున్నప్పుడు అవి వందశాతం స్వచ్ఛమైనవో కాదో చూడాలి. 91.6 క్యారెట్స్‌ బంగారంలో 99 శాతం స్వచ్ఛత ఉంటుంది. అలా ఉన్నవాటిమీద హాల్‌మార్క్‌ గుర్తు ఉంటుంది. దాన్ని గమనించుకోవాలి. అలానే నగ మీద ఏదో ఒక చోట నాణ్యత, హాల్‌మార్క్‌, ముద్రవేసిన సంస్థలోగో, హాల్‌మార్క్‌ వేసిన సంవత్సరం, నగ అమ్మిన సంస్థ చిహ్నం...ఇలా ఐదు గుర్తులు ఉంటాయి. అవి ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. కొన్నిసార్లు ఇవి భూతద్దంలో మాత్రమే కనిపిస్తాయి. అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే కొనుగోలు చేయాలి.

రాళ్ల ధరలు..

వీలైనంతవరకూ అచ్చంగా బంగారంతో చేసిన నగలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఎప్పుడు మార్చుకున్నా పూర్తిస్థాయిలో నష్టం ఉండదు. రాళ్ల నగలు కొంటుంటే...రాళ్లు, బంగారం విలువను వేర్వేరుగా చూపిస్తున్నారో లేదో గమనించుకోండి. సాధారణ రాళ్లకు అసలు విలువ ఉండదు. కానీ కొన్ని దుకాణాలు వీటికీ ధర ఎక్కువగా వేస్తుంటాయి. అందుకే బిల్లు వేసేటప్పుడే దానికి విలువ కట్టకుండా మాట్లాడుకోవాలి. పగడాలు, కెంపులు, అన్‌కట్స్‌కి కాస్త రీసేల్‌ వాల్యూ ఉంటుంది.

ఇన్​వాయిస్​పైనే బిల్లు..

నగలు తీసుకున్నప్పుడు తెల్లకాగితం మీద రాసి ఇచ్చిన బిల్లును వినియోగదారులు తీసుకోవద్దు. ఎప్పుడైనా సరే... దుకాణం వివరాలూ, రిజిస్ట్రేషన్‌ ఉన్న ఇన్‌వాయిస్‌ కాగితం మీదే బిల్లు వేయించాలి. కంప్యూటర్‌ బిల్లు అయితే ఇబ్బంది ఉండదు. బంగారం నాణ్యత విషయంలో మోసపోతే వినియోగదారుల కోర్టును ఆశ్రయించువచ్చు. అందుకే అరగ్రాము బంగారం కొన్నా సరే దానికి వచ్చే బిల్లును తప్పనిసరిగా దాచుకోవాలి.

నమ్మకమైన సంస్థలలోనే..

ఒకేసారి బంగారం కొనుగోలు చేయలేం అనుకునేవారు.. స్కీముల్లో డబ్బులు కడుతుంటారు. నమ్మకమైన సంస్థల్లో కట్టినప్పుడు మాత్రమే మీ డబ్బులకు, బంగారానికి భద్రత ఉంటుంది. బంగారం అప్పటికప్పుడు కొనుక్కోవలసిన అవసరం లేకపోతే కడ్డీలు, నాణేల రూపంలో కొనుక్కోవచ్చు. బ్యాంకులూ బంగారం అమ్ముతాయి...కాస్త ఖరీదు ఎక్కువైనా నాణ్యత విషయంలో పూర్తి హామీ ఉంటుంది.

ఛార్జీల విషయంలో..

పెద్ద పెద్ద దుకాణాల్లో... తరుగు, మజూరీ కలిపి వాల్యూ యాడెడ్‌ ఛార్జీగా బిల్లు వేస్తుంటారు. ఇది ఆరు శాతం నుంచి మొదలై నగను బట్టి ముప్పై శాతం పైనే ఉంటుంది. దీనికి అదనంగా జీఎస్టీ చెల్లించాలి. ఇవన్నీ లెక్కేస్తే... కొన్నిసార్లు తీసుకున్న నగ కంటే రెండు మూడు గ్రాముల పసిడికి అదనంగా బిల్లు చెల్లించాల్సి వస్తుంది. కొనే ముందే ఇవన్నీ పక్కాగా అర్థం చేసుకోగలిగితే మీ డబ్బు వృథాకాదు.

ఇదీ చూడండి: బంపర్ ఆఫర్​: పాత బంగారానికి... కొత్త ఆభరణాలు

ABOUT THE AUTHOR

...view details