Changes in GST Rates: కొత్త ఏడాదిలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విధానంలో కీలక మార్పులు జరగనున్నాయి. జనవరి 1న పాలనపరమైన, విధానపరమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా ఆన్లైన్ ద్వారా అందించే సేవలపైన ఇ-కామర్స్ సంస్థలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
పన్ను ఎగవేతను అరికట్టేలా జీఎస్టీ చట్టాన్ని కేంద్రం సవరించింది. ఫలితంగా ఈ మార్పులు అనివార్యమయ్యాయి.
జనవరి 1 నుంచి జీఎస్టీలో వచ్చే మార్పులివే..
- పాదరక్షలు, వస్త్ర రంగాల్లో విలోమ పన్ను నిర్మాణంలో దిద్దుబాటు అమల్లోకి వస్తుంది. ఫలితంగా ధరలతో సంబంధం లేకుండా అన్ని పాదరక్షలు 12 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయి.
- రెడీమేడ్ దుస్తులు సహా అన్ని వస్త్ర ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీ చెల్లించాలి. అయితే కాటన్‌కు మినహాయింపు ఉంది.
- ఇ-కామర్స్ సంస్థలు అందించే సేవలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉబర్, ఓలా, రాపిడో సంస్థలు.. క్యాబ్, ఆటోరిక్షా, బైక్‌ల ద్వారా ప్రయాణికులకు అందించే సేవలపై 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో క్యాబ్, ఆటోరిక్షా ద్వారా ప్రయాణించేవారికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది.
- స్విగ్గీ, జొమాటో వంటి ఇ-కామర్స్ సర్వీస్ ప్రొవైడర్లు.. రెస్టారెంట్ సేవలపై జీఎస్టీని సేకరించి, ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. అలాగే బిల్లులు జారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ బాధ్యతను రెస్టారెంట్లు నిర్వహించేవి. ఇకపై ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు నిర్వహిస్తాయి.
- జీఎస్టీ రీఫండ్ కోసం ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి.
- ముందు నెలలో జీఎస్టీఆర్-3బీని దాఖలు చేసి.. వ్యాపారులు పన్నులు చెల్లించని సందర్భంలో జీఎస్టీఆర్-1 దాఖలుకు ఇకపై అవకాశం ఉండదు.
- పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడితే.. ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా జీఎస్టీ అధికారులు పన్ను బకాయిలను రికవరీ చేయవచ్చు.
ఇదీ చూడండి:'బీమా రంగంలో ఆవిష్కరణలు- వ్యక్తులకు నచ్చినట్లుగా పాలసీ'