ఆరోగ్య బీమాను మరింత సరళంగా చందాదారులకు అనుకూలంగా మార్చడానికి ఐఆర్‌డీఏఐ, ఇటీవల ముందుగా ఉన్న(ప్రీ-ఎక్జిస్టింగ్) వ్యాధుల నిర్వచనాన్ని సవరించింది. తాజాగా జారీచేసిన సర్క్యులర్‌లో, ముందుగా ఉన్న వ్యాధుల ప్రస్తుత నిర్వచనంలో అదనపు నిబంధనను తొలగించినట్లు తెలిపింది. ఈ చర్య ఆరోగ్య బీమా పాలసీలలో క్లెయిమ్ తిరస్కరణ రేట్లను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆరోగ్య బీమా పాలసీ కింద కొన్ని అనారోగ్యాలను చేర్చడానికి, రెగ్యులేటర్ 2019 సెప్టెంబరులో ఒక సర్క్యులర్ ద్వారా ముందుగా ఉన్న వ్యాధి నిర్వచనాన్ని సవరించింది. ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసిన 3 నెలల్లోపు కొన్ని వ్యాధులు నిర్ధారణ అయినట్లయితే, అవి ముందస్తు వ్యాధులుగా పరిగణిస్తారు. ఈ వ్యాధులు పాలసీ పరిధిలోకి వస్తాయని ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఏదేమైనా, తాజా సర్క్యులర్ ప్రకారం, మూడు నెలల్లో, లేదా తరువాత, ఆరోగ్య బీమాను కొనుగోలు చేసిన తర్వాత కూడా అటువంటి వ్యాధులను పరిగణించరని తెలిపింది. ఆరోగ్య బీమా పాలసీలలో మార్గదర్శకాలలో ఈ సవరణ చేర్చనున్నట్లు తెలిపింది.