తెలంగాణ

telangana

ETV Bharat / business

కేంద్రం కొత్త సెస్- ధరలు మాత్రం పెరగవ్! - అగ్రీసెస్

అగ్రి ఇన్​ఫ్రా సెస్ పేరిట పెట్రోల్​పై రూ. 2.50, డీజిల్​పై రూ.4 సుంకం విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో మధ్యతరగతి వర్గంపై మరో గుదిబండ పడిందని అనుకున్నారు. నిజానికి ఈ నిర్ణయం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావమేమీ ఉండదని తెలుస్తోంది. వినియోగదారుడిపై అదనపు భారం పడదని స్పష్టమవుతోంది. అదెలా అంటారా?

centres new Agri cess not to impact prices of any imported item
కేంద్రం కొత్త సెస్- ధరలు మాత్రం పెరగవు

By

Published : Feb 1, 2021, 6:15 PM IST

  • పెట్రోల్​పై రూ. 2.50 అగ్రి సెస్
  • డీజిల్​పై రూ.4 అగ్రి సెస్
  • పప్పు ధాన్యాలపై 20-50 శాతం అగ్రి సెస్

కేంద్ర ప్రభుత్వం తాజాగా విధించిన 'వ్యవసాయ మౌలిక, అభివృద్ధి సుంకం(ఏఐడీసీ)' లెక్కలివి. వివిధ రకాల ఉత్పత్తులకు ఈ సుంకాన్ని వర్తింపజేస్తూ తాజా బడ్జెట్​లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయినా ఈ ప్రభావం వినియోగదారులపై ఏమాత్రం ఉండబోదు.

ఎందుకంటే అగ్రి సెస్​కు సమానంగా ఆయా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంటే తయారీదారులు దిగుమతి కోసం చెల్లించే సుంకాన్ని.. అగ్రి సెస్​ రూపంలో కేంద్రానికి చెల్లిస్తారు కాబట్టి దీని ప్రభావం వినియోగదారులపై ఉండదు.

నిర్మల హామీ

అగ్రి సెస్ అమలు చేసే క్రమంలో సాధారణ పౌరులపై ఎలాంటి ప్రభావం పడకూడదని జాగ్రత్తలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అగ్రి ఇన్​ఫ్రా సెస్ వల్ల ధరలు పెరిగి ఎండ్ యూజర్లపై ప్రభావం పడదని చెప్పారు. పెంచిన సుంకం... తగ్గిన కస్టమ్స్ డ్యూటీతో సర్దుబాటు అవుతుందని వివరించారు.

నిర్మలా సీతారామన్ స్పష్టత

"నాబార్డు ద్వారా వ్యవసాయానికి మరింత రుణాలు అందించేందుకు వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సుంకాన్ని తీసుకొస్తున్నాం. ఏ ఒక్క వస్తువుపై కూడా వినియోగదారుడు ఇప్పుడు చెల్లిస్తున్న దానికంటే అధికంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి మేం చేసిన సుంకాల పునర్నిర్మాణం మాత్రమే. ఉదాహరణకు 12 శాతం ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 7 శాతానికి తగ్గించాం. దానికి కేవలం 3 శాతం అగ్రి ఇన్​ఫ్రా సెస్​ను కలిపాం. చివరకు వినియోగదారుడు ఇప్పుడు చెల్లిస్తున్నదానికి సమానంగా లేదా తక్కువగానే చెల్లిస్తాడు. ఈ సెస్ విధించిన తర్వాత ఏ వస్తువుపైనా వినియోగదారుడు ఎక్కువగా వ్యయం చేయాల్సిన అవసరం ఉండదు."

-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

రూ.30 వేల కోట్లు సమీకరణ!

సాధారణ ప్రజానీకంపై ఎలాంటి ప్రభావం పడకుండా అగ్రి సెస్​ను రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఏబీ పాండే తెలిపారు. 14-15 రకాల ఉత్పత్తులపై ఈ సుంకాన్ని విధించినట్లు వెల్లడించారు. ఈ సెస్ ద్వారా రూ. 30 వేల కోట్లు వసూలవుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

పప్పు ధాన్యాలపైనా ప్రభావం ఉండదు

దిగుమతి చేసుకున్న పప్పు ధాన్యాలపై అగ్రి సెస్ విధించడం వల్ల ధరలపై ప్రభావం ఉండదని ఇండియా పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్(ఐపీజీఏ) వెల్లడించింది. కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం ద్వారా అగ్రి సెస్​ వల్ల పెరిగిన ధరను స్థిరీకరించవచ్చని పేర్కొంది.

పప్పు ధాన్యాలపై 20-50 శాతం వరకు అగ్రి సెస్​ను విధించింది కేంద్రం. అయితే అదే సమయంలో దిగుమతులపై విధించే కస్టమ్స్ డ్యూటీని గణనీయంగా తగ్గించింది.

"ఈ నిర్ణయం వల్ల పడే ప్రభావం 'సున్నా'. పరిస్థితి యథాతథంగానే ఉంటుంది. దీనిపై మాకు పెద్దగా సమస్యలు లేవు. కొత్తగా విధిస్తున్న పన్ను.. దిగుమతి సుంకాన్ని తగ్గించడం ద్వారా సరిచేయవచ్చు. పప్పు ధాన్యాలపై కనీస మద్దతు ధర కన్నా కస్టమ్స్ డ్యూటీని ఎక్కువగా ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలని మేం కోరుకుంటున్నాం."

-బిమల్ కొఠారీ, ఐపీజీఏ వైస్ ఛైర్మన్

దేశంలో పప్పు ధాన్యాల దిగుమతులు గత మూడేళ్లలో గణనీయంగా తగ్గాయని కొఠారీ తెలిపారు. 2016-17లో 60 లక్షల టన్నులుగా ఉన్న దిగుమతులు... 2020-21(జనవరి) నాటికి 20 లక్షల టన్నులకు పరిమితమయ్యాయి.

ఇదీ చదవండి:ఆరోగ్య రంగానికి రెట్టింపు వ్యయం- కొత్తగా అగ్రిసెస్

ABOUT THE AUTHOR

...view details