ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఈ ఏడాది పదికోట్ల మంది అన్నదాతలకు చేయూత అందించాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు.
రైతులకు ఏడాదికి రూ.6 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తున్న పథకమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద మూడు విడతల్లో సాయం అందజేస్తుండగా, తొలి విడతలో 5 కోట్ల 88 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. రెండో విడతలో 3 కోట్ల 40 లక్షల మంది రైతులకు సాయం అందినట్లు నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు.
భూమి పరిమాణంతో సంబంధం లేకుండా 14 కోట్ల 50 లక్షల మంది రైతులకు ఈ పథకం వర్తిస్తుందని కేంద్రమంత్రి వివరించారు. బంగాల్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. పథకం పురోగతి కూడా చాలా బాగుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఆరంభంలో 2 ఎకరాల వరకు భూమి కల్గిన చిన్న, సన్నకారు రైతులకు అమలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ భూపరిమితిని ఎత్తివేశారు. ఈ పథకం అమలుతో కేంద్ర ఖజానాపై సుమారు 87 వేల కోట్ల రూపాయల భారం పడుతోంది.