కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడటంతో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఆర్థిక ఉద్దీపన పథకాన్ని(బెయిలౌట్ ప్యాకేజ్) ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేయనున్నామని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పరిస్థితులను ఆ బృందం సమీక్షించి సలహాలు ఇస్తుందని తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు కంపెనీలు ప్రకటించే విరాళాలు 'కార్పొరేట్ సామాజిక బాధ్యత' కింద లెక్కిస్తామని ఇంతకుముందే నిర్మల ట్వీట్ చేశారు. సెబీ, ఆర్బీఐ నిబంధనల నుంచి రూ.లక్ష కోట్ల మేరకు ఉపశమనం కల్పిస్తామని ఆ ట్వీట్ల ద్వారా తెలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు.