దేశంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) కొనుగోళ్లు, వినియోగం పెరిగేందుకు ప్రధాన ఆటంకం ఛార్జింగ్ స్టేషన్లు కొరవడటమే. ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా ఒకసారి ఛార్జింగ్ పెడితే, ఎక్కువదూరం ప్రయాణించడానికి అనువుగా ఉండటం లేదు. ఈ ఇబ్బంది నివారించడానికి 24 రాష్ట్రాల్లోని 62 నగరాలకు 2636 విద్యుత్తు ఛార్జింగ్ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఇందువల్ల కంపెనీలూ విద్యుత్తుతో నడిపే సరికొత్త మోడళ్లు రూపొందించేందుకు ముందుకు వస్తాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్తు వాహనాల వినియోగం, అమ్మకాలను ప్రోత్సహించేందుకు ప్రతిపాదించిన 'ఫేమ్' పథకం రెండోదశ కింద, ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు ద్వారా ప్రోత్సాహకాలు అందుకునేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను భారీ పరిశ్రమల శాఖ ఆహ్వానిస్తోంది.