చక్కెర కర్మాగారాలు 2021-22 మార్కెటింగ్ సంవత్సరంలో రైతులకు చెల్లించాల్సిన 'సరసమైన, ప్రోత్సాహకర ధర' (ఎఫ్‌ఆర్‌పీ)ని క్వింటాలుకు రూ.5 చొప్పున పెంచి రూ.290గా కేంద్రం నిర్ణయించింది. చక్కెర కనీస విక్రయ ధరను మాత్రం వెంటనే పెంచే అవకాశం లేదని స్పష్టంచేసింది. బుధవారం జరిగిన 'ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం' (సీసీఈఏ) సమావేశంలో చెరకు కొనుగోలు ధరను ఖరారు చేసినట్లు ఆహారం-వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ విలేకరులకు తెలిపారు.
చెరకు కనీస కొనుగోలు ధర రూ.290 - చెరకు ధర న్యూస్
చెరకు కనీస కొనుగోలు ధర రూ. 290గా కేంద్రం నిర్ణయించింది. క్వింటాకు రూ.5 పెంచినట్లు పేర్కొంది.
"క్వింటా చెరకు ఉత్పత్తి ధర రూ.155గా ఉంది. ఇతర పంటలతో పోలిస్తే చెరకు సాగు ఆకర్షణీయంగా ఉంది. కేంద్రం నిర్ణయం దాదాపు ఐదు కోట్ల మంది రైతులకు మేలు చేస్తుంది. చక్కెర ఎగుమతులు, ఇథనాల్ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం మద్దతునిస్తోంది. అందువల్ల చక్కెర ధరను పెంచాల్సిన కారణం ప్రస్తుతానికి లేదు" అని చెప్పారు. పెట్రోలులో కలిపేందుకు వీలుగా చమురు సంస్థలకు గత మూడు సీజన్లలో రూ.22,000 కోట్ల విలువైన ఇథనాల్‌ను చక్కెర కర్మాగారాలు, డిస్టిలరీలు విక్రయించాయని గోయల్ వెల్లడించారు. ప్రస్తుతం 8.5శాతం ఇథనాల్‌ను పెట్రోలులో కలుపుతుండగా రాబోయే మూడేళ్లలో ఇది 20 శాతానికి పెరుగుతుందని తెలిపారు.
ఇదీ చదవండి:మోదీ 'ప్రగతి' సమావేశం- కీలక ప్రాజెక్ట్‌లపై సమీక్ష