బ్యాంకింగ్ లావాదేవీలు విఫలమైన సమయంలో ఖాతా నుంచి కట్ అయిన నగదును తిరిగి జమ చేయడంలో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేసింది కొత్తగా ఏర్పాటైన వినియోగదారుల భద్రతా ప్రాధికార సంస్థ (సీసీపీఏ). ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్‌ను కోరింది.
ఈ మేరకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎంకే జైన్‌కు లేఖ రాశారు సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖేర్. ఖాతాల నుంచి డిడక్ట్ అయిన మొత్తాన్ని త్వరగా ఖాతాదారునికి తిరిగి పంపించేలా బ్యాంకులను ఆదేశించాలని కోరారు. లావాదేవీలు విఫలమవడం, రద్దై డబ్బు జమ కాకపోవడటం వంటి అంశాలపై ఇప్పటి వరకు 2,850 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (ఎన్సీహెచ్) ద్వారా వచ్చిన వాటిల్లో 20 శాతం సమస్యలు బ్యాంకింగ్ రంగానికి చెందినవే ఉంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
" బ్యాంకులు నగదును ఖాతాల్లో జమ చేస్తున్నప్పటికీ.. ఆర్బీఐ మార్గదర్శకాల్లో సూచించిన మేరకు త్వరగా అందించటం లేదు. ఈ తరహా ఫిర్యాదుల పరిష్కారానికి ఆర్బీఐ సూచనలకు బ్యాంకులు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని ఆర్బీఐని కోరుతున్నాం. త్వరగా నగదు జమచేసేలా బ్యాంకులను ఆదేశించాలి. "