తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎన్​ఎస్​ఈ 'చిత్ర'కు బిగుస్తున్న ఉచ్చు.. సీబీఐ లుక్​ఔట్​ నోటీసులు - చిత్రా రామకృష్ణన్​ న్యూస్​

Chitra Ramakrishna NSE: జాతీయ స్టాక్ ఎక్స్చేంజి మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఎన్​ఎస్​ఈ కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సీబీఐ ఆమెను ప్రశ్నించింది. దేశం విడిచి వెళ్లిపోకుండా చూసేందుకు చిత్రతో పాటు ఎన్​ఎస్​ఈ మాజీ సీఈఓ రవి నారాయణ్, మాజీ సీఓఓ ఆనంద్ సుబ్రమణియన్​పై లుక్​ఔట్​ నోటీసులు జారీ చేసింది సీబీఐ.

Chitra Ramakrishna NSE
చిత్రా రామకృష్ణన్

By

Published : Feb 18, 2022, 2:37 PM IST

Updated : Feb 18, 2022, 3:01 PM IST

Chitra Ramakrishna NSE: జాతీయ స్టాక్ ఎక్స్చేంజి కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో ఎన్​ఎస్​ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణను కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ స్ట్రాటజిక్‌ అడ్వైజర్‌గా ఆనంద్‌ సుబ్రమణియన్‌ నియామకం, వెంటనే పదోన్నతులు వంటి విషయాలపై ఆమెను విచారించినట్లు సమాచారం. నిందితులు దేశం విడిచి వెళ్లిపోకుండా చూసేందుకు చిత్రతో పాటు ఎన్​ఎస్​ఈ మాజీ సీఈఓ అయిన రవి నారాయణ్, మాజీ సీఓఓ ఆనంద్ సుబ్రమణియన్​పై లుక్​ఔట్​ నోటీసులు జారీ చేసింది సీబీఐ.

ఈ కేసులో దిల్లీకి చెందిన ఓపీజీ సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్​ ఓనర్, ప్రమోటర్ సంజయ్ గుప్తాపై కూడా కేసు నమోదు చేశారు అధికారులు. ఎన్​ఎస్​ఈ సర్వర్ ఆర్కిటెక్చర్​గా పనిచేసే సంజయ్..​ గుర్తు తెలియని అధికారులతో కలిసి కుట్రలో పాలుపంచుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఎన్​ఎస్​ఈ, సెబీకి చెందిన మరికొంతమందిని ప్రశ్నించింది.

ఒక్కసారిగా వివాదాల సుడి..

రెండున్నర దశాబ్దాల పాటు ఎన్‌ఎస్‌ఈకి సేవలందించిన చిత్ర.. 2016 డిసెంబరులో అనూహ్యంగా ఎండీ, సీఈఓ పదవి నుంచి వైదొలిగారు. బోర్డు సభ్యులతో విభేదాల కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ తర్వాత ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో సెబీ ఆమెపై చర్యలు చేపట్టింది. కో-లొకేషన్‌ కేసులో బ్రోకర్లకు అక్రమంగా లబ్ధి చేకూర్చినట్లు ఆమెపై ఆరోపణలు రాగా.. 2013-14లో ఆమె డ్రా చేసుకున్న జీతంలో 25శాతం ఇన్వెస్టర్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఫండ్‌(ఐపీఈఎఫ్‌)లో జమ చేయాలని సెబీ ఆదేశించింది. అంతేగాక, ఏ లిస్టెడ్‌ కంపెనీ లేదా మార్కెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇనిస్టి్ట్యూట్‌తో కలిసి పనిచేయకుండా ఐదేళ్ల పాటు ఆమెపై నిషేధం విధించింది.

తెరపైకి 'యోగి'..

చిత్ర రామకృష్ణ హయాంలో ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ స్ట్రాటజిక్‌ అడ్వైజర్‌గా ఆనంద్‌ సుబ్రమణియన్‌ను అనూహ్యంగా నియమించడం, తిరిగి గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, ఎండీ సలహాదారుగా మార్చడం వంటి విషయాల్లో పాలనాపరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సెబీ ఇటీవల దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే సంచలన విషయాలు బయటకొచ్చాయి. చిత్ర గత 20 ఏళ్లుగా ఓ 'అదృశ్య' యోగి ప్రభావానికి లోనైనట్లు తెలిసింది. హిమాలయాల్లో ఉండే ఆ యోగితో ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన కీలక విషయాలను పంచుకుని ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ఆయన చేతిలో కీలుబొమ్మగా మారి యోగి చెప్పినట్లు నిర్ణయాలు తీసుకున్నారని దర్యాప్తులో వెలుగుచూసింది. ఇప్పుడు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తోంది సీబీఐ.

ఇదీ చదవండి:స్టాక్​ మార్కెట్​కు సారథి.. కానీ 'అదృశ్య' యోగి చేతిలో కీలుబొమ్మ.. ఇది ఓ 'చిత్ర' కథ!

Last Updated : Feb 18, 2022, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details