Chitra Ramkrishna: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో(ఎన్‌ఎస్‌ఈ) సంచలనం రేపిన కో-లొకేషన్ కుంభకోణం కేసులో ఆ సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ చిత్రారామకృష్ణను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అరెస్టు చేసింది. అనంతరం ఆమెను వైద్య పరీక్షలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను సీబీఐ ప్రధాన కార్యాలయంలో లాకప్‌లో ఉంచినట్లు వెల్లడించారు. చిత్రారామకృష్ణను వరుసగా మూడు రోజులు ప్రశ్నించిన సీబీఐ.. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించిందని అధికారులు చెప్పారు. అయితే ఆమె సరైన సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు.
చివరకు.. దర్యాప్తు సంస్థకు చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలోని సీనియర్ సైకాలజిస్ట్ కూడా చిత్రను ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. అప్పుడు కూడా ఆమె సరైన సమాధానం ఇవ్వకపోడంతో.. అరెస్ట్ చేయడమే ఏకైక మార్గమని అధికారులు నిర్ధరణకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దిల్లీలోనే చిత్రను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే చిత్ర ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శనివారం కొట్టివేసింది.
చిత్రారామకృష్ణ 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబరు వరకు ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు.