తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏటీఎం విత్‌డ్రా.. ఇకపై మరింత భారం కానుందా? - Central Bank

ఏటీఎం వినియోగదారులకు 'షాక్'​నిచ్చేలా మరోసారి ఛార్జీలు పెరగనున్నాయా.. అంటే అవుననే కథనాలు వినిపిస్తున్నాయి. ఏటీఎంల నిర్వహణ వ్యయం భారీగా పెరిగాయని ఏటీఎం ఆపరేటర్లు ఆర్బీఐకి విన్నవించుకున్న నేపథ్యంలో.. ఆర్బీఐ, కేంద్ర బ్యాంకులు సానుకూలంగా స్పందించి ఇంటర్​ఛేంజ్​ ఫీజులను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఖాతాదారులపైనే ఈ అదనపు భారం పడనుంది.

Cash withdraw, Balance Checking are more burden in ATMs
ఏటీఎం విత్‌డ్రా మరింత భారం కానుందా?

By

Published : Feb 15, 2020, 5:59 PM IST

Updated : Mar 1, 2020, 10:53 AM IST

ఇకపై ఏటీఎంలలో నగదు విత్‌ డ్రా, బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడం మరింత భారం కానుందా.. అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు పెంచాలని కోరుతూ భారత ఏటీఎం ఆపరేటర్ల సంఘం ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు లేఖ రాసింది. ఇందుకు కేంద్ర బ్యాంక్‌ కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నట్లు ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

ప్రస్తుతం ఒక బ్యాంక్‌ కార్డును వేరే బ్యాంక్‌కు చెందిన ఏటీఎంలో వినియోగించినప్పుడు సదరు ఏటీఎం ఆపరేటర్‌కు ఖాతాదారుడు ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు చెల్లించాల్సిన విషయం తెలిసిందే. కస్టమర్లకు ఐదు ట్రాన్సాక్షన్లను ఉచితంగా అందిస్తూ.. అంతకుమించి జరిగే లావాదేవీలకు కొంత మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నారు. పరిమితి దాటాక చేసే నగదు ట్రాన్సాక్షన్‌ల(విత్‌డ్రా)పై రూ.15, నగదు రహిత ట్రాన్సాక్షన్‌ల(బ్యాలెన్స్‌ ఎంక్వైరీ)పై రూ.5 చొప్పున ఈ ఛార్జీలు ఉన్నాయి.

ఖర్చులు పెరిగాయంటున్న ఆపరేటర్లు...

అయితే.. ఇంటర్‌ఛేంజ్‌ ఫీజులను పెంచాలని కోరుతూ ఏటీఎం ఆపరేటర్ల సంఘం ఈ నెల 13న ఆర్‌బీఐకి లేఖ రాసింది. ఏటీఎం భద్రత, నిర్వహణ ప్రమాణాలను ఆర్‌బీఐ పెంచిన నేపథ్యంలో ఏటీఎంల నిర్వహణ ఖర్చు పెరిగిందని.. దీని వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆపరేటర్లు లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల కొత్త ఏటీఎంలను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నామని పేర్కొన్నారు.

ట్రాన్సాక్షన్స్​ ఎలా ఉంటాయంటే...

దేశంలో ఏటీఎంల వినియోగం, వ్యాప్తిని పెంచే ప్రతిపాదనల కోసం గతేడాది ఆర్‌బీఐ ఓ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత డిసెంబరులో తమ ప్రతిపాదనలను రిజర్వ్‌ బ్యాంక్‌కు సమర్పించింది. అందులో ప్రధానంగా ఇంటర్‌ఛేంజ్‌ ఫీజులను పెంచాలని సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పట్టణ ప్రాంతాల్లో ఏటీఎం ఇంటర్‌ఛేంజ్‌ ఫీజును రూ.17(నగదు ట్రాన్సాక్షన్స్‌), రూ.7(నగదు రహిత ట్రాన్సాక్షన్స్‌)కు పెంచాలని... ఉచిత ట్రాన్సాక్షన్లను కూడా మూడింటికే పరిమితం చేయాలని సూచించింది. గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో ఈ ఫీజులను రూ.18, రూ.8కి పెంచుతూ.. ఉచిత లావాదేవీలను ఆరుకు పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను కేంద్ర బ్యాంక్‌ పరిశీలిస్తోంది. దీనిపై ఆర్‌బీఐ ఏటీఎం ఆపరేటర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఖాతాదారుడిపై అదనపు భారం తప్పదు!

ఇదీ చదవండి:ఆన్​లైన్​లో ఆర్డర్​ చెయ్​.. ప్రత్యక్షంగా వెళ్లి కొనేయ్​!

Last Updated : Mar 1, 2020, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details