వాహనంలో ప్రయాణం.. రాత్రివేళ నిద్రించేందుకు అందులోనే ప్రత్యేకంగా బెడ్‌రూం కమ్ డ్రాయింగ్‌రూం.. ఓ టీవీ, చిన్న కిచెన్, వాష్‌రూం.. ఇలాంటి ప్రత్యేక సౌకర్యాలున్న ‘క్యారవాన్’లు పర్యాటకులకు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. కొవిడ్‌తో కోలుకోలేని దెబ్బతిన్న పర్యాటక రంగం కొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది. ఇప్పటికే విదేశాల్లో.. దిల్లీ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో పర్యాటక ఆపరేటర్లు వీటిని వాడుతున్నారు. తాజాగా కొందరు టూర్ ఆపరేటర్లు క్యారవాన్ యాత్రల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. పెద్ద ఏజెన్సీలు, రిజిస్టర్డ్ టూర్ ఆపరేటర్లు పర్యాటకుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
యాత్రలకు రూపకల్పన ఇలా..
- ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పర్యాటకానికి ఇంకా అనుమతి రాలేదు. ఎంతకాలం పడుతుందో తెలియదు. అనుమతి వచ్చాక కూడా పర్యాటకుల్లో భయాలుంటాయి. వాటిని నివృత్తి చేసేలా టూర్ల నిర్వహణలో అనేక మార్పులు చేయబోతున్నాం’’ అని ఓ ప్రముఖ టూర్ ఆపరేటర్ పేర్కొన్నారు.
- ‘‘ప్రస్తుతం అంతర్జాతీయ విమాన సర్వీసుల్లేవు. మరో పది నెలల వరకు విదేశీ టూర్లకు వెళ్లేందుకు పర్యాటకులు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు నిర్వహించిన ఆపరేటర్లు ఇప్పుడు దేశంలో పర్యాటక ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు. నా దగ్గర 40 మంది ఉద్యోగులున్నారు. దేశంలో పర్యాటక ప్రాంతాలతో వినూత్న యాత్రలు రూపకల్పన చేయిస్తున్నా. స్థానిక వింతలు, విడ్డూరాల్ని ఆస్వాదించే ప్యాకేజీలు తయారుచేస్తున్నాం’’ అని హైదరాబాద్‌కు చెందిన మరో ప్రముఖ ఆపరేటర్ పేర్కొన్నారు.
పెట్టుబడులకు సంస్థలు
కుటుంబంతో వెళితే హోటళ్లలో కొవిడ్ నేపథ్యంలో పరిశుభ్రత పాటిస్తున్నారా? లేదా? అన్న భయాలుంటాయి. దిల్లీ, జయపుర, ఆగ్రా, చెన్నై, మహాబలిపురం వంటి పర్యాటక ప్రాంతాల మధ్య ఇప్పటికే కార్వాన్‌లో తీసుకెళ్లి చూపించే సదుపాయం ఉంది. వాహనంలో కుటుంబసభ్యులు, డ్రైవర్‌కు మధ్య బ్యారియర్ ఉంటుంది. కొవిడ్ నేపథ్యంలో క్యారవాన్ పర్యాటకానికి ప్రాధాన్యం పెరుగుతుంది. ఈ వాహనాల తయారీపై పెట్టుబడులకు పెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్యాకేజీ సదుపాయాల దృష్ట్యా ఈ వాహనాల అద్దె ఎక్కువే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఆపరేటర్లు ఈ తరహా యాత్రలు నిర్వహించే ఆసక్తితో ఉన్నారు.