గత ఏడాది నుంచి వాహన విక్రయాలు భారీగా పడిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది కరోనా కారణంగా వాహన అమ్మకాలపై మరింత ప్రతికూల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో విక్రయాలు పెంచుకునేందుకు పండుగ సీజన్‌ను అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలని వాహన తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. దసరా, దీపావళిని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల్లోని కార్లపై ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించాయి.
దేశవ్యాప్తంగా కార్ల కంపెనీలు, డీలర్లు.. దాదాపు అన్ని మోడళ్లపై నగదు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లతో పాటు సరికొత్త పథకాలతో ప్రయోజనాలు అందిస్తున్నాయి. అయితే కొనుగోలు చేసే ప్రదేశాన్ని బట్టి ఈ ఆఫర్లలో వ్యత్యాసాలుంటాయి.
ఏ ఏ కంపెనీ ఎలాంటి ఆఫర్లు ఇస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం...
మారుతీ సుజుకీ
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీదారైన మారుతీ సుజుకీ.. అరేనా, నెక్సా రిటైల్ నెట్‌వర్క్‌ల ద్వారా వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బ్రెజ్జా, బాలినో, సియాజ్, ఎక్ క్రాస్ కార్లపై దీపావళి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అరేనా మోడళ్లపై 16 అక్టోబర్ వరకే ఆఫర్లో బుకింగ్స్‌కు అవకాశమివ్వగా.. నెక్సా మోడళ్లపై 20 అక్టోబర్ వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
మారుతీ సుజుకీ ఆఫర్లు ఇలా..
- ఫ్రీ-ఫెస్‌లిఫ్ట్ డిజైర్, ఎస్-క్రాస్‌లపై రూ.55వేల వరకు డిస్కౌంట్. సెలెరియో పై రూ.53వేల వరకు డిస్కౌంట్ ఉంది.
- ప్రీమియం హ్యాచ్‌బ్యాక్.. బాలినోపై రూ.42వేల వరకు ప్రయోజనాలు.
- ఇగ్నిస్‌పై రూ.59,200 విలువైన ప్రయోజనం, సియాజ్‌పై ఇంతే మొత్తంలో డిస్కౌంట్.
- ఎస్-క్రాస్ పై రూ.62,200 విలువైన ప్రయోజనాలు.
- సెలెరియో, ఎస్-ప్రెస్సోలపై రూ.53వేల వరకు ప్రయోజనాలు.
- ఆల్టోపై రూ.41వేలు.. వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ లపై రూ.40వేల వరకు ప్రయోజనాలు
హ్యుందాయ్
వెన్యూ, వెర్నా, క్రెటా, టక్సన్, కోనా ఈవీ మినహా మిగతా వాటిపై రూ.1 లక్ష వరకు ప్రయోజనాలను హ్యుందాయ్ అందిస్తోంది. సులభతర ఫినాన్స్ పథకాన్ని కూడా కంపెనీ ఇస్తోంది. మెడికల్ వృత్తిలో ఉన్న వారికి, చార్టర్ అకౌంటెంట్లకు, ఎస్‌ఎంఈలకు, ఉపాధ్యాయులకు, కొందరు కార్పొరేట్లకు ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది.
పండుగ ప్రయోజనాలు ఉన్న జాబితాలో.. శాంత్రో, గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ10 నియోస్, ఎలైట్ ఐ20, ఆరా, ఎలాంట్రా సెడాన్ మోడళ్లు ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31 ఈ ఆఫర్లు ఇవ్వనున్నట్లు హ్యూందాయ్ ప్రకటించింది.
వేరియంట్‌ను బట్టి శాంత్రోపై రూ.45వేల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. గ్రాండ్ ఐ10 బీఎస్6 పై రూ.60వేల వరకు, గ్రాండ్ ఐ10నియోస్ బీఎస్6 పై రూ.25వేల వరకు ఎలైట్ ఐ20 స్పోర్జ్ పై రూ.75వేల వరకు డిస్కౌంట్, ఆరాపై రూ.30వేల వరకు ప్రయోజనాలు, ఎలాంట్రాపై రూ.1లక్ష వరకు ప్రయోజనాలు పొందవచ్చు.
టాటా మోటార్స్
రూ.40వేల ఎక్సేంజ్ బోనస్‌తో పాటు రూ.15వేల కార్పొరేట్ డిస్కౌంట్‌తో టాటా హ్యారియర్ డార్క్ ఎడిషన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ మోడల్‌లో మిగతా వేరియంట్లపై రూ.25వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. టియాగో పై రూ.30వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చు.