వస్తు సేవల పన్ను అనేది పూర్తిగా జీఎస్టీ మండలికి సంబంధించిన విషయం. కొత్త వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం, జీఎస్టీ రేట్ల మార్పు లాంటి అన్ని నిర్ణయాలు మండలి తీసుకుంటుంది. ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న దృష్ట్యా కొన్ని చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.
అనిల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీ నిధులు అవసరం
ప్రస్తుతం అప్పుడప్పుడు జీఎస్టీఎన్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు... జీఎస్టీ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచేలా నిధుల కేటాయింపు జరగాలని విశ్లేషకులు కోరుతున్నారు. జీఎస్టీని అమల్లోకి తెచ్చాక ఐదేళ్లలోగా పెట్రోలియం ఉత్పత్తులను కూడా ఈ చట్ట పరిధికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచినందున... ఆ దిశగా అడుగులు వేసేలా బడ్జెట్లో ఏదైనా ప్రతిపాదన చేయాలని వారు సూచిస్తున్నారు.
పన్ను తగ్గించాలి
ఆర్థిక వ్యవస్థకు కీలక రంగాలైన స్థిరాస్తి, మౌలికం వంటివి సిమెంటుపై ఆధారపడి ఉన్నాయి. అందువల్ల సిమెంటుపై ప్రస్తుతమున్న 28 శాతం జీఎస్టీని తగ్గించాలని నిపుణులు అంటున్నారు. స్టాంపు డ్యూటీని సాధ్యమైనంత త్వరగా జీఎస్టీ విధానంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా స్థిరాస్తి రంగంపై పన్ను భారం తగ్గితే సామాన్యుడికి గృహాలు అందుబాటు ధరలకు లభిస్తాయని చెబుతున్నారు.
సులువైన రిటర్న్‌లు కావాలి
ప్రస్తుతం ఆర్ఓసీ, ఆదాయపు పన్ను, పీఎఫ్ రిటర్న్‌లతో పోలిస్తే... జీఎస్టీ రిటర్న్‌లు దాఖలు చేయడం క్లిష్టంగా ఉందని, దీన్ని సులువుగా చేసేందుకు ప్రభుత్వం బడ్జెట్లో చర్యలు ప్రతిపాదించాలని విశ్లేషకులు కోరుతున్నారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేని వాళ్ల నుంచి కొనుగోళ్లు చేస్తే వర్తించే రివర్స్ ఛార్జీను ప్రభుత్వం తొలగించింది. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఉపయోగపడే... దాన్ని మళ్లీ తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. జీఎస్టీ పరిధిలోకి ఎక్కువ మందిని తీసుకొచ్చేందుకు క్షేత్రస్థాయిలో అవగాహన తీసుకురావాలని వారు అభిప్రాయపడుతున్నారు.