చైనాలోని రెండో అతిపెద్ద స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్ కార్యాలయానికి 2 నెలలుగా వందలమంది వచ్చి వెళ్తున్నారు. 'మా డబ్బులు మాకిచ్చేయండి' అంటూ ఆ కంపెనీ బాండ్లను కొనుగోలు చేసిన మదుపర్లతో పాటు సంస్థ నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న వారు కూడా వీరిలో ఉంటున్నారు. ఏడాదిలోగా ఇలాంటి చెల్లింపులు 124 బిలియన్ డాలర్ల మేర జరపాల్సి ఉన్నా, అందులో పదో వంతు మాత్రమే కంపెనీ వద్ద ఉంది. సరిగ్గా 13 ఏళ్ల కిందట.. సెప్టెంబరులోనే అమెరికాలోని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అయిన లేమాన్ బ్రదర్స్‌లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని సునామీలా ముంచెత్తింది. ఎవర్‌గ్రాండ్ సంక్షోభాన్ని దానితో పోలుస్తూ, కొందరు ఆందోళన చెందుతుంటే, కంపెనీకి భూనిల్వలున్నందున అలాంటి భయాలు అక్కర్లేదని మరికొందరు పేర్కొంటున్నారు.
నిర్మాణంలో 800 ప్రాజెక్టులు
ఎవర్‌గ్రాండ్ చైనా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రనే పోషిస్తోంది. ఈ కంపెనీకి 2 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారు. వీరు, వీరి కుటుంబాలు కలిసి వందల కోట్ల యువాన్‌ల సొమ్ముతో కంపెనీ బాండ్లను కొనుగోలు చేశారు. ఈ కంపెనీ కింద 800 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అందులో సగం నిధుల కొరతతో ఆగిపోయాయి. ఎవర్‌గ్రాండ్‌కు కావాల్సిన నిర్మాణ వస్తువులను సరఫరా చేసేందుకు, ఇతర పనుల్లో వేల కొద్దీ కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఇవన్నీ ఏటా 38 లక్షల మందికి ఉపాధి చూపుతున్నాయని అంచనా.
అప్పులతోనే అంతా..
చైనాలోని స్థిరాస్తి కంపెనీలు భారీగా అప్పులు చేయడం, భారీ టర్నోవరు పొందడం, భారీ లాభాలు ఆర్జించడం అనే మూడు సూత్రాలనే నమ్ముతాయి. 2018లో ఎవర్‌గ్రాండ్ సైతం 7,200 కోట్ల యువాన్‌ల రికార్డు లాభాన్ని పొందింది. అయితే సంస్థ ఏటా 10,000 కోట్ల యువాన్‌లను వడ్డీ కిందే కట్టడం గమనార్హం. లావాదేవీలు బాగా జరిగిన రోజుల్లోనూ కంపెనీ వద్ద నిర్వహణ నగదు ఉండేది కాదు. డబ్బులు అవసరమైతే బ్యాంకుల వైపు చూసేది. అవి కాదంటే.. సొంత ఉద్యోగుల నుంచే లక్ష్యాలు పెట్టి మరీ సమీకరించేంది. అందుకు ప్రతిగా ‘చౌషౌబౌ’ పేరిట క్రౌడ్ ఫండింగ్ బాండ్లను జారీ చేసేది. 25 శాతం వడ్డీ ఆశ చూపించేది. దీంతో కొంత మంది అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టారు. అయినా కూడా నిధులు చాలకపోవడంతో ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఇది కాస్తా అప్పుల కుప్పను పెంచింది. ఈ ఏడాది జూన్ చివరి నాటికి 2 లక్షల కోట్ల యువాన్ (300 బిలియన్ డాలర్లు)ల అప్పులు సంస్థకు ఉన్నట్లు రుణ పుస్తకం చెబుతోంది. ఈనెల 23న సంస్థ చెల్లించాల్సిన 83.5 మిలియన్ డాలర్ల వడ్డీ కీలకం కానుంది.
మన ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ గుర్తుకొస్తోంది