కెయిర్న్ ఎనర్జీ రెట్రోస్పెక్టివ్(పాత తేదీల నుంచి విధించే) పన్ను వివాదం కేసులో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశాల ప్రకారం డబ్బు చెల్లించనందుకు గానూ.. ఫ్రాన్స్‌లోని భారత ప్రభుత్వ ఆస్తుల జప్తునకు అవసరమైన న్యాయప్రక్రియ బుధవారం పూర్తయింది. ఫ్రెంచ్ కోర్టు అనుమతుల మేరకు వీటిని స్వాధీనం చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు కూడా వెల్లడించాయి.
భారత ప్రభుత్వ ఆస్తుల యాజమాన్య హక్కులను కెయిర్న్ ఎనర్జీ తీసుకునేందుకు ఫ్రెంచ్ కోర్టు జూన్ 11నే ఉత్తర్వులు జారీ చేసిందని, అందుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ బుధవారంతో ముగిసిందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. పారిస్‌లో భారత ప్రభుత్వానికి చెందిన దాదాపు 20 ఆస్తులను కంపెనీ జప్తు చేసుకున్నట్లు సమాచారం. వీటి విలువ 20 మిలియన్ యూరోల(రూ.177 కోట్ల)కు పైనే ఉంటుందట.
భారత ప్రభుత్వం పెట్టుబడి ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ గతేడాది డిసెంబర్‌లో ఆర్బిట్రేషన్ న్యాయస్థానం కెయిర్న్ ఎనర్జీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ కంపెనీకి 1.2 బిలియన్ డాలర్లు చెల్లించాలని భారత్‌ను ఆదేశించింది. అయితే, ఈ మొత్తాన్ని భారత ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడం వల్ల సొమ్ము రాబట్టుకోవడం కోసం కెయిర్న్ ఎనర్జీ పలు దేశాల్లోని న్యాయస్థానాలను ఆశ్రయించింది. అమెరికా, యూకే, నెదర్లాండ్స్, కెనడా, ఫ్రాన్స్, సింగపూర్, జపాన్, యూఏఈ తదితర దేశాల్లోని కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసింది. ఆయా దేశాల్లోని భారత ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసుకునేలా అనుమతులు ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఫ్రెంచ్ కోర్టు నుంచి అనుమతులు రావడం వల్ల అక్కడి భారత ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.