మార్కెట్లలో అనిశ్చితి, సమీప భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకునే అవకాశం లేకపోవడం వల్ల ప్రస్తుతం బంగారం ధరలు స్థిరంగానే ఉంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దీపావళి నాటికి పసిడి ధరలు నింగికెగసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మరి కొద్ది నెలల్లో 10 గ్రాముల పుత్తడి రూ. 52 వేలకు చేరకుంటుందని అంచనా వేస్తున్నారు.
అంతటితో ఆగదు!
ప్రస్తుత పోకడలను బట్టి చూస్తే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో రెండు సంవత్సరాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.65 వేలకు చేరుకుంటుందని లెక్కలు వేస్తున్నారు.
ఇప్పటికే గరిష్ఠం
పుత్తడి ధరలు ఇప్పటికే గరిష్ఠ శిఖరాలకు చేరుకుంటున్నాయి. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజి కాంట్రాక్ట్‌లో బంగారం ధరలు రికార్టు స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాములకు రూ. 48,589 ధర పలుకుతోంది.
అయితే ఈ పరంపర మరిన్ని రోజులు కొనసాగుతుందని మార్కెట్ విశ్లేషకులు నొక్కిచెబుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం ధర రోజుకో గరిష్ఠానికి చేరుతుందని అభిప్రాయపడుతున్నారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం వంటి అంశాల వల్ల మార్కెట్లో అనిశ్చితి, భయాలు నెలకొంటున్నాయని పేర్కొన్నారు.
"స్వల్పకాలంలో బంగారం ధర రూ. 48,800 నుంచి - రూ. 49 వేల మధ్య కొనసాగుతుంది. దీర్ఘకాలంలో చూస్తే దీపావళి నాటికి రూ.51 వేల నుంచి రూ.52 వేల వరకు చేరుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు పసిడి ధర 1,790 డాలర్లకు చేరవచ్చు. దీర్ఘకాలంలో ఈ ధరలు 1,850 డాలర్ల వరకు ఎగబాకే అవకాశం ఉంది."
-అనుజ్ గుప్తా, ఏంజెల్ బ్రోకింగ్
భారత్, సహా ప్రపంచ వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తగ్గించినందున రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరుగుతున్నాయని తెలిపారు గుప్తా.
పెట్టుబడులకు 'కనక' వర్షమే!
కరోనా కేసులు పెరుగుతుండటం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడే కోలుకునే పరిస్థితులు లేకపోవడం వల్ల బంగారం పెట్టుబడులకు సురక్షితమనే భావన మరింత బలపడుతుందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్-కమాడిటీ రీసెర్చ్ హెడ్ హరీష్ తెలిపారు.
ఆర్థిక వ్యవస్థలు మందగమనంలో కూరుకుపోయిన సమయంలో పెట్టుబడులకు బంగారం ఉత్తమమైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు.
"ఆంక్షలు, లాక్డౌన్ వల్ల బంగారానికి డిమాండ్ గణనీయంగా పడిపోయినప్పటికీ... గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లను పరిశీలిస్తే 2020 ముగిసేవరకు అనిశ్చితి కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా అదుపులోకి వచ్చినా... బంగారం ధరలు పెరుగుతాయని తెలుస్తోంది. అప్పటివరకు బంగారం కొంటూనే ఉండండి. భౌతిక రూపంలో కాకపోయినా.. డిజిటల్ రూపంలో కొనండి."
-ప్రథమేశ్ మాల్యా, ఏంజెల్ బ్రోకింగ్
బంగారం ధరలు రూ. 65 వేలు దాటే అవకాశం ఉందని అన్మోల్ జువెలర్స్ వ్యవస్థాపకులు ఇషు దట్వానీ పేర్కొన్నారు.
"మరో రెండు సంత్సరాల్లో బంగారం ధరలు రూ. 60 నుంచి రూ. 65 వేలకు సులభంగా చేరుకుంటాయి. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. చాలా బ్యాంకులు బంగారం కొంటున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడుతుంది. దీనితో పాటు భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల బంగారం ధరల్లో బుల్ జోరు కొనసాగుతుంది."
-ఇషూ దట్వానీ, అన్మోల్ జువెలర్స్ వ్యవస్థాపకులు
వచ్చే రెండేళ్లపాటు బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని డబ్ల్యూహెచ్పీ జువెలర్స్ డైరెక్టర్ ఆదిత్య పేఠే అంచనా వేశారు. ఆరు నెలల తర్వాత ఎంత పెరుగుతుందనే విషయం స్పష్టంగా చెప్పలేమని అన్నారు. అయితే ఆరునెలల నుంచి సంవత్సర కాలంలో సుమారుగా రూ.55 వేలకు చేరుకోవచ్చని చెప్పారు. ఆ తర్వాత కాస్త నెమ్మదించినా.. మళ్లీ ధరలు పుంజుకుంటాయని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి-బంగారం ధరలు మరింత ప్రియం.. 10 గ్రా. ఎంతంటే?