Union Budget 2022: రాబోయే బడ్జెట్‌లో ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం అమిత ప్రాధాన్యం ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆకాంక్షించారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పరుగులు పెట్టించే నిర్ణయాలు తీసుకోవడంతో పాటు.. అసమానతల తొలగింపునకూ చర్యలుండాలని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పనకు కేటాయింపులను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈసారి బడ్జెట్లో పన్ను రేట్ల కోతలు ఎక్కువగా ఉండవనే తాను భావిస్తున్నానని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సుబ్బారావు తన అభిప్రాయాలు తెలిపారు.
సంతృప్తికర వృద్ధి అవసరం
వృద్ధి నెమ్మదించడం వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. పలు రంగాలు కార్మిక ఆధారిత అసంఘటిత రంగం నుంచి మూలధన ఆధారిత సంఘటిత రంగానికి మారడమూ మరో కారణం. ఉద్యోగాల సృష్టికి అవసరమైన స్థాయిలో వృద్ధి లేదు.
ఆదాయ అసమానతలు తగ్గేలా
అసంఘటిత రంగంలో ఎక్కువగా పనిచేసే అల్పాదాయ వర్గాల ఆదాయాలపై కొవిడ్-19 పరిణామాలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. అధిక ఆదాయ వర్గాలు తమ ఆదాయాలను పరిరక్షించుకోవడమే కాకుండా.. సంపద, పొదుపును పెంచుకున్నాయి. అత్యంత అసమానతలున్న దేశాల్లో భారత్ ఒకటని ప్రపంచ అసమానతల నివేదిక గుర్తించినందున, సరిదిద్దే చర్యలు అవసరం.
పన్ను రేటు కోతలుండవేమో