కేంద్ర బడ్జెట్‌పై వాహన పరిశ్రమ వర్గాలు భిన్నంగా స్పందించాయి. పలువురు ఈ బడ్జెట్‌ను స్వాగతించగా... మరికొందరు పద్దుపై నిరాశ వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్లో ప్రధానంగా వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ అయిన ఫాడా(ఫెడరేషన్ ఆఫ్ ఆటో డీలర్స్ అసోసియేషన్) తెలిపింది. ప్రభుత్వం ప్రతిపాదించిన చర్యలన్నీ 3-4 నెలల్లో అమలు చేస్తే డిమాండ్‌పై సానుకూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, చిన్న వాణిజ్య వాహనాలకు డిమాండ్ ఏర్పడుతుందని తెలిపింది. కానీ బడ్జెట్లో వాహన రంగానికి ప్రత్యక్ష ప్రయోజనాలేవీ లేవని అభిప్రాయపడింది.
"ఇది సమగ్ర బడ్జెట్ అయినప్పటికీ... సత్వరమే డిమాండ్‌ను పునరుద్ధరించే అంశాలు లేవు. వాహన పరిశ్రమకు ప్రత్యక్ష ప్రయోజనాలు ఏవీ లేకపోవడం నిరాశాజనకం. ఎన్‌బీఎఫ్‌సీలకు ద్రవ్య లభ్యత కోసం మద్దతు ఇస్తున్నందున... వాహన రంగానికి ఉపయోగపడుతుంది."
-ఆశిశ్ హర్షరాజ్ కాలే, ఫాడా అధ్యక్షుడు
బడ్జెట్‌పై సియామ్ అధ్యక్షుడు రాజన్ వాధేరా పెదవి విరిచారు. బడ్జెట్ ప్రసంగంలో ఆశించినదేమీ లేదని అభిప్రాయపడ్డారు.
"ప్రస్తుత మందగమనం నేపథ్యంలో డిమాండ్‌ను పునరుద్ధరించడానికి బడ్జెట్లో ప్రత్యక్ష ప్రయోజనాలు ఉంటాయని భారత వాహన పరిశ్రమ ఆశించింది. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఆశించిందేమీ లేదు."
-రాజన్ వాధేరా, సియామ్ అధ్యక్షుడు
డిమాండ్‌ను పునరుద్ధరించేందుకు ప్రోత్సాహక-ఆధారిత వాహన స్క్రాపేజ్ పథకం, డీజిల్ బస్సుల కోసం నిధుల కేటాయింపు, లిథియం అయాన్ బ్యాటరీలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు వంటి పలు సూచనల్ని సియామ్ చేసిందని చెప్పారు రాజన్. అయితే వీటన్నింటినీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు.
ఏసీఎంఏ సంతృప్తి