తెలంగాణ

telangana

ETV Bharat / business

పద్దు​ 2020: ఖర్చు ఎక్కువే చేయాలి.. కానీ సరైన మార్గంలో - ఆర్థికమాంద్యంను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్​లో వృద్ధి మందగమనానికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారోనని పారిశ్రామికవేత్తల నుంచి సామాన్యుల వరకు వేచిచూస్తున్నారు. అయితే పడిపోతున్న ఆర్థికవృద్ధిని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం తన పెట్టుబడులు పెంచాలని, ఆ చేసే వ్యయం సరైన మార్గంలో ఉండాలని ప్రముఖ ఆర్థికవేత్త మహేంద్రబాబు కురువా సూచిస్తున్నారు.

Budget 2020: Spend More & Spend It Right
బడ్జెట్​ 2020: ఖర్చు ఎక్కువే చేయాలి.. కానీ సరైన మార్గంలో

By

Published : Jan 24, 2020, 6:03 PM IST

Updated : Feb 18, 2020, 6:33 AM IST

ఫిబ్రవరి1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ తన మొదటిపూర్తిస్థాయి బడ్జెట్​ను సమర్పించనున్నారు. కశ్మీర్​ నుంచి కన్యాకుమారివరకు, కోటీశ్వరుల నుంచి అతి సామాన్యుల వరకు.. ఆమె బడ్జెట్ ప్రసంగం గురించే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పడిపోతున్న భారత వృద్ధికి చేయూతనిచ్చి పునరుద్ధరిస్తారనే ఆశతో వేచిచూస్తున్నారు.

భారత ఆర్థికవ్యవస్థ గత 11 సంవత్సరాలుగా నెమ్మదిగా పెరుగుతోంది. మరోవైపు నిరుద్యోగ రేటు నాలుగు దశాబ్దాల్లోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

తగ్గుతున్న డిమాండ్​

ధనిక-పేద అంతరాన్ని తగ్గించాలి!

పాక్షిక నైపుణ్యంగల​ శ్రామిక శక్తికి ఆధారమైన ఉత్పాదక రంగం మందకొడిగా కొనసాగుతోంది. గ్రామీణ వృద్ధికి కీలకమైన వ్యవసాయ రంగం వృద్ధిరేటు 3 శాతం కంటే తక్కువగా ఉంది.

దావోస్​లో జరిగిన 'ప్రపంచ ఆర్థిక సదస్సు' సందర్భంగా విడుదల చేసిన ఎకనామిక్ అవుట్​లుక్​, గ్లోబల్​ సోషల్​ మొబిలిటీ ఇండెక్స్​, ఆక్స్​ఫామ్​ రిపోర్ట్​... భారత సంపద సృష్టి రేటు క్షీణిస్తోందని స్పష్టం చేశాయి. ధనికులు-పేదల మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై భారత్​ దృష్టి కేంద్రీకరించాలని స్పష్టంగా సూచించాయి.

మార్గం ఏమిటి?

ధనిక-పేద అంతరాలను తగ్గించడానికి, ఆర్థికమాంద్యాన్ని అరికట్టి వృద్ధిరేటును పెంచడానికి ఉన్న సరైన పరిష్కారం ప్రభుత్వ వ్యయం (పెట్టుబడులు) పెంచడమే.

ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక మాంద్యానికి ప్రధాన కారణం... సరైన డిమాండ్ లేకపోవడం. సులభంగా చెప్పాలంటే... మార్కెట్​లో తగినంత వస్తువులు, సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రజలకు తగినంత కొనుగోలు శక్తి లేకపోవడం.

ఆర్​బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదిక కూడా.. వినియోగదారుల, వ్యాపారుల విశ్వాసం సన్నగిల్లుతోందని, కర్మాగారాల సామర్థ్య వినియోగం కూడా క్షీణిస్తోందని స్పష్టం చేసింది. ఇది డిమాండ్​ క్షీణతను స్పష్టం చేస్తోంది. అందువల్ల, ఆర్థికవ్యవస్థలో అవసరమైన డిమాండ్​ను పునరుద్ధరించాలి. ఇందుకోసం ప్రభుత్వ వ్యయం కూడా బాగా పెంచాలి.

జీడీపీ పెరుగుదల రేటు

ఆర్​బీఐ 2019లో కీలక వడ్డీరేట్ల (రెపో రేటు)ను 135 బేసిస్ పాయింట్లు లేదా 1.35 శాతం మేర తగ్గించింది. దీని ఫలితంగా తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు లభించి గృహాలు, వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని ఆశించింది. దురదృష్టవశాత్తు.. ఇది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీర్ఘకాలంలో మాత్రం ఫలితాలు రాబట్టవచ్చు.

ఇలాంటి సమయంలో రానున్న బడ్జెట్లో​... రంగాలవారీగా ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి. ఖర్చులను కూడా సమయానుసారంగా పెంచడం వివేకవంతమైన చర్య అవుతుంది.

ఆర్థికలోటు ఓ భ్రమేనా?

సరళంగా చెప్పాలంటే, ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి అవసరమైన మొత్తం రుణాలు తీసుకోవడాన్ని ద్రవ్యలోటు సూచిస్తుంది. ఇది ఆదాయం, వ్యయం మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తుంది.

ప్రభుత్వం ఎక్కువ వ్యయం చేస్తే అది ఆర్థికలోటును విస్తృతం చేస్తుందని, ధరల పెరుగుదలకు కారణమవుతుందని, చివరకు వృద్ధి మందగించి పెద్ద సమస్యకు దారితీస్తుందనే వాదనలున్నాయి.

నిజానికి ప్రభుత్వ వ్యయం ఎక్కువ ఉపాధిని సృష్టిస్తుంది. ఫలితంగా ప్రజలకు ఆదాయం సమకూరుతుంది. ఇది వినియోగాన్ని మరింత పెంచుతుంది. గుణక ప్రభావం (మల్టిప్లియర్ ఎఫెక్ట్​) కారణంగా, ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ సాధ్యమవుతుంది.

తరువాతి దశలో, వ్యాపార విశ్వాసం... పన్ను ఆదాయాన్ని మెరుగుపరుస్తుంది. చివరకు ఆర్థిక పరిస్థితి గాడిన పడుతుంది. అందువల్ల ద్రవ్యలోటు గణాంకాలు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేపటి మంచి కోసం ఇవాళ ప్రభుత్వ పెట్టుబడులు పెంచాల్చిందే.

రంగాల వారీగా నిర్దిష్ట వ్యయం చేయాలి

ఒకసారి మనం ఖర్చు చేయాలా? వద్దా? అనే దానిపై స్పష్టత వస్తే.. అప్పుడు ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి. ఇది కచ్చితంగా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.

జీడీపీలో... వ్యవసాయ రాబడి 2002-11 మధ్య 4.4 శాతం ఉండగా, అది 2012-18 మధ్య 3.1 శాతానికి పడిపోయింది. ఫలితంగా వ్యవసాయ ఆదాయాలు తగ్గుతాయి. అది కచ్చితంగా వినియోగాన్నీ తగ్గిస్తుంది. కనుక ప్రభుత్వం తన పెట్టుబడులు పెంచడం వల్ల రైతులకు, రైతు కూలీలకు ఉపాధి లభిస్తుంది. ఫలితంగా వారి ఆదాయాలు వృద్ధిచెంది, వినియోగ డిమాండ్ కూడా పెరుగుతుంది.

గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో, విలువలను పెంచే సరఫరా గొలుసులో (సప్లై చైన్స్​) పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది. ఇది దేశ గ్రామీణ దృక్పథాన్ని మారుస్తుంది. ఇదే సమయంలో ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణకూ తోడ్పడుతుంది. ఈ సలహా వజ్రాయుధమేమీ కాదు. ఆర్థిక మందగమనాన్ని పారద్రోలడానికి చేసే విధాన నిర్ణయాల్లో... దీనిని పరిగణించమని ఇచ్చిన మంచి సలహా మాత్రమే.

కచ్చితంగా చెప్పాలంటే...ఇది ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన సమయం.. అయితే ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వీలైనంత వరకు సరైన మార్గంలో ఖర్చుపెట్టాలి.

- డాక్టర్ మహేంద్రబాబు కురువ, అసిస్టెంట్ ప్రొఫెసర్,

హెచ్​ఎన్​బీ ఘర్వాల్​ సెంట్రల్ యూనివర్సిటీ, ఉత్తరాఖండ్

ఇదీ చూడండి: నేటి నుంచి అందుబాటులోకి ఒప్పో 'ఎఫ్​15' స్మార్ట్​ఫోన్​

Last Updated : Feb 18, 2020, 6:33 AM IST

ABOUT THE AUTHOR

...view details