బడ్జెట్... ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తెచ్చే వార్షిక ఖర్చు, జమ వివరాల పత్రం. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే సత్తా ఉన్న ఈ పద్దుపై సాధారణంగానే ప్రజల దృష్టి ఉంటుంది. కానీ ఈ సారి బడ్జెట్‌కు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్డీఏ 2.0 ప్రవేశపెడుతోన్న మొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌తో పాటు... ప్రస్తుతమున్న ఉన్న రాజకీయ, ఆర్థిక స్థితిగతులే ఇందుకు కారణం. వరుసగా రాష్ట్రాల్లో అధికారం కోల్పోతున్న మోదీ సర్కారుకు ఈ బడ్జెట్ మరీ ముఖ్యం.
రాష్ట్రాలు కీలకం..
2019 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థానాలను గెలుచుకొని తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. లోక్‌సభ సమరంలో సత్తా చాటిన కాషాయ పార్టీ ప్రాభవం క్రమంగా తగ్గుతూవచ్చింది. సార్వత్రికం అనంతరం జరిగిన రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో డీలాపడింది. హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో ఎన్నికలు జరగగా... ఇందులో కేవలం హరియాణాలోనే అధికారాన్ని కాపాడుకోగలిగింది. అదీ ఇతర పక్షాల మద్దతుతో. ఇదే స్పష్టం చేస్తోంది ప్రజలను ఆకర్షించడానికి ఈ పద్దు ఎంత కీలకమో.
ఫిబ్రవరిలో దిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీకి పోలింగ్. వరుసగా రాష్ట్రాల్లో అధికారం కోల్పోతున్న భాజపాకు ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యం. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లాంటి వాటిపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు ఇలా పలు వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్నింటినీ అధిగమిస్తూ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకర్షించేలా బడ్జెట్లో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవసరం ఉంది.
ఆర్థిక వ్యసస్థకు ఊతమిస్తారా?
దేశ ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. ప్రస్తుత సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 2012-13 తర్వాత.. అత్యల్పంగా నమోదు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనితో పాటు ఇటీవల ద్రవ్యోల్బణం కూడా ఐదేళ్ల గరిష్ఠాన్ని చేరింది. ప్రజల కొనుగోళ్లు తగ్గినందువల్ల పడిపోయిన వినియోగ డిమాండ్ ఇంకా గాడిలో పడలేదు. వీటితో పాటు అనేక ఇతర కారణాలతో.. జీడీపీ వృద్ధి క్షీణిస్తోంది.