స్వచ్ఛమైన, నమ్మకమైన, బలమైన రంగాలు ఆర్థిక వ్యవస్థకు అత్యావశ్యకమని అన్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారం అయ్యేందుకు ఆర్థిక నిర్మాణాలు కలిసి ముందుకు సాగాలని చెప్పారు. మొండి బకాయిలతో సతమతమవుతోన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్బీఎఫ్సీ)లు కోలుకునేందుకు పలు సవరణలు ప్రకటించారు. గత కొన్నేళ్లలో బ్యాంకులకు ప్రభుత్వం రూ.3 లక్షల 50 వేల కోట్ల మూలధన సాయం చేసినట్లు వెల్లడించారు.
"గత కొన్నేళ్లలో ప్రభుత్వం బ్యాంకులకు 3 లక్షల 50 వేల కోట్ల మూలధన సాయం చేసింది. ఈ బ్యాంకుల్లో ప్రభుత్వ సంస్కరణలు అమలు చేయడం ద్వారా అవి మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. అదనపు మూలధనం కోసం మూలధన మార్కెట్‌ను ఆశ్రయించేందుకూ ఆ బ్యాంకులను ప్రోత్సహిస్తున్నాం. అన్ని షెడ్యూల్ వాణిజ్య బ్యాంకుల సంరక్షణ కోసం బలమైన చర్యలు చేపడుతున్నాం. డిపాజిటర్ల సొమ్ము అత్యంత సురక్షితంగా ఉంటుంది. డిపాజిటర్ల బీమా కవరేజీని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నాం. సర్ఫేసీ చట్టం-2002 ప్రకారం ఎన్‌బీఎఫ్‌సీల రుణాలు తిరిగి రాబట్టుకునేందుకు పరిమితిని 500 కోట్ల నుంచి 100 కోట్లకు తగ్గించేందుకు ప్రతిపాదిస్తున్నాం. కోటి రూపాయల రుణ పరిమితిని 50 లక్షలకు తగ్గిస్తున్నాం. తద్వారా తక్కువ మొత్తంలోని రుణాలను సైతం సులభంగా తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంటుంది."