ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించిన 'స్వచ్ఛంద పదవీ విరమణ' (వీఆర్ఎస్) పథకానికి 70 వేల నుంచి 80 వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశముందని యాజమాన్యం అంచనా వేస్తోంది.
నవంబరు 4న ప్రారంభమైన వీఆర్ఎస్ పథకం దరఖాస్తుల గడువు డిసెంబరు 3న ముగియనుంది. ఈ మేరకు ఇప్పటికే మార్గదర్శకాలు ప్రకటించినట్లు తెలిపిన బీఎస్‌ఎన్‌ఎల్ ఛైర్మన్ పీకే పుర్వార్.. 70 వేల నుంచి 80 వేల మంది వీఆర్ఎస్ తీసుకుంటే 7 వేల కోట్ల రూపాయల జీతాల బిల్లు ఆదా అవుతుందన్నారు.
లక్షమందికి అర్హత
లక్షన్నర మంది బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల్లో దాదాపు లక్షమందికి వీఆర్ఎస్ అర్హత ఉంది. ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకుంటే ఇప్పటి వరకు పనిచేసిన సంవత్సరాలకు ఏడాదికి 35 రోజులు, తదుపరి పదవీ విరమణ వయసు వరకు.. ఏడాదికి 25 రోజులు చొప్పున జీతాన్ని పొందుతారు.