క్రిప్టోకరెన్సీ సంచలనం బిట్‌కాయిన్ మరో రికార్డు నెలకొల్పింది. ఒక బిట్‌కాయిన్ విలువ తొలిసారి 60,000 డాలర్ల మార్క్ దాటింది. శనివారం సాయంత్రానికి (అమెరికా కాలమానం ప్రకారం) 61,081 డాలర్ల వద్దకు చేరింది. భారత కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.44.3 లక్షల పైమాటే. ఫిబ్రవరిలో కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్న బిట్ కాయిన్ తిరిగి రికార్డు స్థాయిలో పుంజుకోవడం విశేషం.
దాదాపు ఏడాది కాలంలో బిట్‌కాయిన్ విలువ 1,000 శాతానికిపైగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వివిధ కంపెనీలు బిట్‌కాయిన్ లావాదేవీలను అధికారికం చేయడం, ఎలాన్ మస్క్, జాక్ డోర్సీ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలూ ఇందులో పెట్టుబడి పెట్టడం వంటి పరిణామాలు ఇందుకు కారణమయ్యాయి.