అతి పెద్ద క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ విలువ మరోసారి రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ క్రిప్టో కరెన్సీ మార్కెట్లోకి ప్రవేశిస్తుందని, త్వరలోనే తమ ప్లాట్ ఫామ్‌పై క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు వీలు కల్పించొచ్చని వెలువడిన ఊహాగానాలు ఇందుకు కారణమయ్యాయి. అమెజాన్‌పై ఈ అంచనాలతో బిట్‌కాయిన్ విలువ సోమవారం (అమెరికా కాలమానం ప్రకారం) 14 శాతం పుంజుకుని.. ఇంట్రాడేలో దాదాపు 40 వేల డాలర్ల స్థాయికి చేరింది. చివరకు 37 వేల డాలర్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో బిట్‌కాయిన్ తాకిన విలువ ఐదు వారాల గరిష్ఠ స్థాయి కావడం విశేషం.
అమెజాన్‌పై ఊహాగానాలు ఎందుకు?
డిజిటల్ కరెన్సీ, బ్లాక్‌చైన్ ప్రోడక్ట్ విభాగానికి వ్యూహ రచన, నేతృత్వం వహించే అధికారి కోసం చూస్తున్నట్లు అమెజాన్ ఇటీవల ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌తో అమెజాన్ క్రిప్టో కరెన్సీ మార్కెట్లోకి ప్రవేశిస్తుందని.. ఊహాగానాలు పెరిగిపోయాయి. త్వరలోనే అమెజాన్ ప్లాట్‌ఫామ్‌పై క్రిప్టో కరెన్సీల వినియోగాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని కూడా అంచనాలు వచ్చాయి. ఫలితంగా బిట్‌కాయిన్‌కు డిమాండ్ భారీగా పెరిగింది.