భారత్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పెద్దలు కుదిర్చిన వివాహంతో పోల్చారు బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్ సంస్థ చీఫ్ కిరణ్ మజుందార్ షా. టీకాల విషయంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై చమత్కారంగా ట్వీట్ చేశారు.
"భారత్లో టీకాల పరిస్థితి పెద్దలు కుదిర్చిన వివాహం(అరేంజ్డ్ మ్యారేజ్)లా ఉంది. తొలుత మనం సిద్ధంగా ఉండము. తర్వాత మనకు ఎవరూ నచ్చరూ. ఆ తర్వాత ఎవరూ దొరకరు. వివాహమైనవారు/టీకా పొందినవారు.. వేరొకరు/మరో టీకా.. ఇంకా మంచిదై ఉండొచ్చని ఆలోచిస్తూ చింతిస్తుంటారు. అసలేదీ దొరకనివారు ఏదొస్తే అది అని సిద్ధంగా ఉన్నారు."
- కిరణ్ మజుందార్ షా, బయోకాన్ చీఫ్
అంతకుముందు.. వ్యాక్సిన్ల కొరతపై మజుందార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నెలా 7 కోట్ల డోసులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకోవచ్చా అని ఆరోగ్య శాఖను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. గందరగోళ పరిస్థితులు పోవాలంటే వ్యాక్సిన్ల లభ్యతపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. టీకాల సరఫరా వివరాలను బహిర్గతం చేసినప్పుడే ప్రజలు సంయమనం పాటిస్తూ ప్రశాంతంగా వేచి చూస్తారని అన్నారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులను అందించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, దిల్లీ సహా దేశంలోని అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొరతపై ఫిర్యాదులు చేస్తున్నాయి.
ఇదీ చూడండి:'కేంద్రం వ్యాక్సిన్ విధానంతో మూడో దశ ముప్పు'