తెలంగాణ

telangana

ETV Bharat / business

బిల్​గేట్స్ జీవితంలో చీకటి కోణం... అందుకే అలా...

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్​ గురించి ఓ నివేదిక సంచలన విషయాలు బయటపెట్టింది. ఓ మహిళా ఉద్యోగితో ఆయన సంబంధాలపై విచారణ జరిపిన కారణంగానే బిల్​గేట్స్ బోర్డు నుంచి తప్పుకున్నట్లు పేర్కొంది. ఈ విషయం సంస్థ అధికారులే స్వయంగా వెల్లడించారనేది నివేదిక సారాంశం.

Bill Gates
బిల్​గేట్స్

By

Published : May 17, 2021, 2:02 PM IST

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు, దాతృత్వ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన బిల్‌ గేట్స్‌ 2020లో సంస్థ బోర్డు నుంచి వైదొలిగారు. తన భార్య మెలిందాతో కలిసి ఏర్పాటు చేసిన 'బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌' నిర్వహించే ధార్మిక కార్యక్రమాలపై మరింత దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని బిల్‌ అప్పట్లో ప్రకటించారు. అయితే, అది నిజం కాదని పలు అంతర్జాతీయ పత్రికలు తాజాగా పేర్కొన్నాయి. సంస్థలోని ఓ మహిళా ఉద్యోగితో కొన్నేళ్ల క్రితం బిల్‌ గేట్స్‌ లైంగిక సంబంధాలు కొనసాగించారని.. దీనిపై బోర్డు ఓ బయటి న్యాయ సంస్థతో విచారణ చేయించిందని కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన బోర్డు నుంచి వైదొలిగినట్లు మైక్రోసాఫ్ట్‌ అధికారిక వర్గాలే వెల్లడించినట్లు తెలిపాయి.

2019లో బోర్డు దృష్టికి..

పలు పత్రికల కథనాల ప్రకారం.. తనతో సన్నిహిత సంబంధాన్ని ప్రారంభించాలని కోరుతూ బిల్‌ గేట్స్‌ 2000 సంవత్సరంలో సంస్థలోని ఓ ఉద్యోగిని బిల్‌ గేట్స్ కోరారు. ఈ విషయాన్ని సదరు మహిళ 2019లో బోర్డు దృష్టికి తీసుకొచ్చింది. దీన్ని క్షుణ్నంగా పరిశీలించిన బోర్డు లోతైన విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఓ బయటి న్యాయ విచారణ సంస్థను నియమించింది. విచారణ కొనసాగినన్ని రోజులు ఆ ఉద్యోగికి సంస్థ పూర్తి మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలోనే బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు బిల్‌ గేట్స్‌ ప్రకటించారు. దీంతో విచారణ ఎటూ తేలకుండానే ముగిసింది. అయితే, విచారణ కొనసాగుతుండగానే సంస్థ డైరెక్టర్లు గేట్స్‌ తీరును తప్పుబట్టారని.. బోర్డు నుంచి ఆయనను తప్పించాలని నిర్ణయించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి తెలిపినట్లు డో జోన్స్ వార్తా సంస్థ పేర్కొంది.

దీనిపై బిల్‌ గేట్స్‌ అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. ఉద్యోగితో ఉన్న సంబంధానికి, బోర్డు నుంచి వైదొలగడానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. 20 ఏళ్ల క్రితం ఆమెతో సంబంధాలు ఉండేవని.. చివరకు స్నేహపూర్వక వాతావరణంలోనే అది ముగిసిందన్నారు. ఈ వ్యవహారానికి, బోర్డు నుంచి వైదొలగడానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మైక్రోసాఫ్ట్‌లో మహిళల పట్ల వ్యవహరించే తీరు, 'మీ టూ' ఆరోపణలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలోనే బిల్‌ గేట్స్‌పై విచారణ జరగడం గమనార్హం.

విడాకులకు కారణం అదేనా?

మరోవైపు దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకుల కోసం బిల్‌గేట్స్‌ - మెలిందా దంపతులు ఇటీవలే కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్‌ అధినేతలుగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవడం యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విడిపోవడానికి దారితీసిన కారణాలను ఈ జంట చెప్పనప్పటికీ.. లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో గేట్స్‌ సంబంధాలు నచ్చని మెలిందా ఆయన నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు ప్రముఖ పత్రిక వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఇటీవల ఓ కథనంలో పేర్కొంది.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details