షేర్ మార్కెట్ బిగ్ బుల్‌గా పిలిచే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మూడో త్రైమాసికంలో వదులుకున్న కొన్ని షేర్లు అనూహ్యంగా పుంజుకోవడం గమనార్హం. మొత్తం తొమ్మిది కంపెనీల్లో ఆయన తన వాటాల్లో కొంత భాగాన్ని ఉపసంహరించుకున్నారు. వాటిలో కొన్ని కంపెనీల షేర్ల విలువ గణనీయంగా వృద్ధి చెందింది.
ఝున్‌ఝున్‌వాలా మోస్ట్ ఫేవరెట్ అయిన టైటాన్ కంపెనీ సహా క్రిసిల్, యాప్‌టెక్, ఫెడరల్ బ్యాంక్, ర్యాలిస్ ఇండియా, ఫోర్టిస్ హెల్త్‌కేర్, ఆటోలైన్ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్, ఫస్ట్‌కోర్స్ సొల్యూషన్స్ కంపెనీల వాటాల నుంచి ఝున్‌ఝున్‌వాలా కొంత భాగాన్ని విక్రయించారు. వీటిలో ఫోర్టిస్ హెల్త్‌కేర్, క్రిసిల్ మినహా మిగతా కంపెనీల షేర్లన్నీ మార్చి 2020 నాటి కనిష్ఠాల నుంచి దాదాపు రెట్టింపవడం విశేషం. యాప్‌టెక్ కంపెనీలోని తన వాటా నుంచి బిగ్ బుల్ 0.17 శాతం విక్రయించారు. దీంతో ఆ కంపెనీలో ఆయన వాటా మూడో త్రైమాసికంలో 23.84 శాతానికి తగ్గింది.