కొవిడ్-19 టీకా కొవాగ్జిన్‌ను పెద్దఎత్తున ఉత్పత్తి చేసేందుకు వీలుగా రూ.100 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కోరినట్లు తెలిసింది. కొవిడ్-19 సెకండ్ వేవ్ ముప్పు వల్ల దేశీయంగా టీకా వేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇతర దేశాల నుంచి టీకా సరఫరా చేయాలనే ఒత్తిళ్లు అటు ప్రభుత్వం మీద, ఇటు టీకా ఉత్పత్తి సంస్థల మీద పెరిగాయి.
ఈ నేపథ్యంలో సాధ్యమైనంత అధికంగా టీకా ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం తయారీదార్లకు సూచించింది. దీంతో ఏడాదికి 70 కోట్ల డోసుల టీకా ఉత్పత్తి చేసేందుకు భారత్ బయోటెక్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కంపెనీకి ఉన్న యూనిట్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవటంతో పాటు బెంగళూరు సమీపంలో మరొక యూనిట్‌ను సిద్ధం చేస్తోంది. అందువల్ల వచ్చే రెండు మూడు నెలల వ్యవధిలో పెద్దఎత్తున టీకా డోసులను అందించేందుకు వీలుందని తెలిసింది. దీనికి అనుగుణంగా నిధులు సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.