భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన రోటావాక్-5డి వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం తెలిపింది. పిల్లల్లో రోటా వైరస్ నుంచి రక్షణకు ఇప్పటికే రోటావాక్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన సంస్థ.. వ్యాక్సిన్‌ను మరింత అభివృద్ధి పరచి రోటావాక్ 5డిగా తీసుకువచ్చింది. బఫర్ సొల్యూషన్ అవసరం లేకుండా నిల్వ చేయగలగటం, 0.5 మి.లీ డోసేజ్‌లో టీకాను తీసుకురావటం ఈ నూతన రోటావాక్-5డి ప్రత్యేకత. పిల్లల్లో ప్రబలంగా వ్యాపించే రోటా వైరస్ నుంచి ఈ అభివృద్ధి పరచిన వ్యాక్సిన్ మరింత రక్షణ కల్పించటమే కాక.. నిల్వ, సరఫరా, డిస్పోసల్ లోనూ తక్కువ ఖర్చు అవుతుందని కంపెనీ తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ ప్రీక్వాలిఫికేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ సరఫరా.. మరింత వేగవంతం కానుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఏటా 2 లక్షల మరణాలు..
ఐదేళ్ల లోపు వయసున్న పిల్లల్లో ప్రాణాంతక డయేరియాకు రోటా వైరస్ కారణమవుతుంది. తద్వారా ఏటా 2 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. 20 లక్షల మంది పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. రోటా వైరస్ కారణంగా సంక్రమించే వ్యాధులకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఫస్ట్ జనరేషన్ రోటావాక్ వ్యాక్సిన్ అడ్డుకట్ట వేసింది. ఇప్పటివరకు 250 మిలియన్ డోసుల రోటావాక్ టీకాను గ్లోబల్‌గా భారత్ బయోటెక్ సరఫరా చేసింది. రోటావాక్ వ్యాక్సిన్‌కు 2018 జనవరిలో డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలిపింది.
1986-1988 మధ్యలో దిల్లీలోని ఎయిమ్స్‌లో మొదటగా వైరస్ సోకిన పిల్లల నుంచి ఈ రోటా వైరస్‌ను గుర్తించి వేరుచేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ రోటా వైరస్ నుంచి పిల్లలను రక్షించే సోషల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టుకు భారత్ బయోటెక్ అంకురార్పణ చేసింది. 2013లో ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన డేటా.. ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైంది.