కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే 'కొవాగ్జిన్' టీకాను తయారు చేసిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, ఇక తన దృష్టిని ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్-19 టీకా ఆవిష్కరణపై కేంద్రీకరించింది. దీనిపై నాలుగు ప్రధాన నగరాల్లో మొదటి దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభించింది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, నాగ్‌పుర్, పట్నా నగరాల్లో ఈ క్లినికల్ పరీక్షలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా దాదాపు 150 నుంచి 200 మంది వలంటీర్లకు ముక్కు ద్వారా టీకా (బీబీవీ154- అడెనోవైరస్ వెక్టార్డ్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్) ఇచ్చి ఫలితాలను విశ్లేషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరీక్షల నిర్వహణకు భారత్ బయోటెక్‌కు ఇటీవల డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి ఇచ్చింది.
ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీ కోసం గత ఏడాది సెప్టెంబరులో భారత్ బయోటెక్, యూఎస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇన్ సెయింట్ లూయీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కొవిడ్-19 వ్యాధికి ఛింప్ అడినోవైరస్‌తో సింగిల్ డోస్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ తయారు చేయటం ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రధానోద్దేశం. ఈ టీకా తయారయ్యాక దాన్ని, యూఎస్, జపాన్, ఐరోపా దేశాలను మినహాయించి మిగిలిన దేశాల్లో విక్రయించే హక్కులు భారత్ బయోటెక్‌కు ఉంటాయి.
ఎన్నో ప్రయోజనాలు
కొవిడ్-19 వ్యాధి ప్రధానంగా ముక్కు ద్వారా వ్యాపిస్తుంది. అందువల్ల ముక్కు ద్వారా ఇవ్వటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు భారత్ బయోటెక్ కథనం. టీకా సమర్థంగా పనిచేయటంతో పాటు, సూది గుచ్చటంలాంటివి ఉండవు. టీకా ఇవ్వటం ఎంతో సులువు. ముక్కులో ఒక చుక్క టీకా వేస్తే చాలు. అదీ ఒక డోస్ చాలు. పిల్లలు, పెద్దవాళ్లకు ఇది ఎంతో సౌకర్యవంతమైన విధానం. పెద్ద మొత్తంలో టీకా తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేయటానికి వీలుంటుంది. ఎలుకలు, కోతులకు ఈ టీకా ఇచ్చినప్పుడు మెరుగైన ఫలితాలు కనిపించాయని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందువల్ల దీనిపై మలిదశ పరీక్షలు చేపట్టారు.