కొవిడ్-19కు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్ టీకా నలభై దేశాలకు సరఫరా కానుంది. ఈ దేశాలకు టీకా సరఫరా చేసేందుకు అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 'బ్రెజిల్‌తో పాటు పలు ఇతర దేశాలకు టీకా సరఫరా చేయటానికి సిద్ధంగా ఉన్నాం. అందుకు అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేశాం.' అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఏ ధరకు టీకా అందించాలనేది ఆ దేశాన్ని బట్టి, సరఫరా చేయటానికి ఉన్న సమయం.. తదితర పలు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుందని వివరించాయి.
అవకాశాన్ని బట్టి..
ఇప్పటికే కొన్ని డోసుల 'కొవాగ్జిన్' టీకాను బ్రెజిల్, యూఏఈ దేశాలకు అందించింది భారత్ బయోటెక్. ఇంకా ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్ తదితర దేశాలకు టీకా సరఫరా చేయటానికి కంపెనీ సిద్ధంగా ఉంది. అంతేగాక యూఎస్‌లో కొవాగ్జిన్‌ను అందించటం కోసం ఆక్యుజెన్ అనే యూఎస్ సంస్థతో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా అవకాశం ఉన్నమేరకు వివిధ దేశాలకు టీకా సరఫరా చేయటానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.