కొవాగ్జిన్ టీకాల ఉత్పత్తి పెంచుతున్నట్లు ఉత్పత్తిదారు భారత్ బయోటెక్ ప్రకటించింది. ఏడాదికి 70 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్, బెంగళూరులోని టీకా ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యం బలోపేతానికి దశలవారిగా చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ తెలిపింది.
'ఏడాదికి 70 కోట్ల కొవాగ్జిన్ టీకాల ఉత్పత్తే లక్ష్యం' - bharat biotech vaccine production
16:06 April 20
టీకాల ఉత్పత్తి పెంచుతున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటన
కొవాగ్జిన్ ఉత్పత్తి ప్రారంభించిన సమయంలో సంస్థ సామర్థ్యం 20 కోట్ల డోసులేనని భారత్ బయోటెక్ పేర్కొంది. అధునాతన సౌకర్యాల వల్ల తక్కువ సమయంలో ఉత్పత్తి పెంచగలుగుతున్నట్లు తెలిపింది.
"టీకా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచాలంటే ఏళ్ల సమయం, భారీ పెట్టుబడి అవసరమవుతుంది. అయితే, బీఎస్ఎల్-3 తయారీ యూనిట్లు అందుబాటులో ఉండటం వల్ల తక్కువ సమయంలో ఉత్పత్తి పెంపు సాధ్యపడింది. వాణిజ్య స్థాయిలో వ్యాక్సిన్ తయారీ అనుభవం ఉన్న ఇండియన్ ఇమ్యునలాజిక్స్తో భాగస్వామ్యం వల్ల.. సాంకేతిక బదిలీ కార్యక్రమం కొనసాగుతోంది. విదేశాల్లో కూడా అనుభవంతో కూడిన తయారీ భాగస్వాముల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం."
-భారత్ బయోటెక్
దిగుమతులపై ఆధారపడకుండా వ్యాక్సిన్ తయారీలో ఉపయోగించే 'ఐఎమ్ డీజీ అగోనిస్ట్' మాలిక్యూల్స్‌ను విజయవంతంగా తయారు చేస్తున్నామని, త్వరలో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. వాణిజ్య స్థాయిలో ఈ మాలిక్యూల్స్ ఉత్పత్తి భారత్‌లో ఇదే మొదటిసారని భారత్ బయోటెక్ వెల్లడించింది.